కామిరెడ్డిపై కక్షసాధింపు | - | Sakshi
Sakshi News home page

కామిరెడ్డిపై కక్షసాధింపు

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటున్న కిలివేటి, కామిరెడ్డి, తదితరులు (ఫైల్‌)

పెళ్లకూరు : వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై టీడీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు అక్రమంగా కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారు. మూడు నెలలుగా బెయిల్‌ కూడా రానివ్వకుండా కుట్రలు పన్నుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే పెళ్లకూరు పోలీసులు మూడు పర్యాయాలు కామిరెడ్డిని రిమాండ్‌ నుంచి కస్టడీలోకి తీసుకుని ఇబ్బందిపెడుతున్నట్లు మండిపడుతున్నారు.

వేర్వేరు కేసులతో వేధింపులు

పెళ్లకూరు మండలం కలవకూరు వద్ద స్వర్ణముఖినదిలో నిబంధనలకు విరుద్దంగా యంత్రాలతో టీడీపీ నేతలు చేపట్టిన ఇసుక తవ్వకాలను మార్చి 14వ తేదీన రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీనిపై అక్రమార్కులు ఆగ్రహించి పోలీసులను ఉసిగొల్పారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జెడ్పీటీసీ సభ్యులు నన్నం ప్రిస్కిల్లా, డీసీసీబీ మాజీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్‌రెడ్డితో పాటు మొత్తం26 మందిపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారు. ఇందులో సత్యనారాయణరెడ్డితో పాటు మరో 11మందిని అరెస్టు చేసిన పోలీసులు మార్చి 16వ తేదీన నెల్లూరు సబ్‌ జైలుకు తరలించారు. ఈ కేసులో ఏప్రిల్‌ 8వ తేదీన బెయిల్‌ మంజూరైంది. అయితే 11మందిని మాత్రమే పోలీసులు విడుదల చేశారు. చెంబేడు గోదాము విషయంలో సత్యనారాయణరెడ్డిపై మళ్లీ కేసు పెట్టి రిమాండ్‌లోనే ఉంచేశారు. 70 ఏళ్లు పైబడిన కామిరెడ్డిని దారుణంగా వేధిస్తుండడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement