● సత్యవేడు టీడీపీలో నాటకీయ పరిణామాలు ● ఎమ్మెల్యే తనయుడికి పార్టీ పదవి ● నాడు విమర్శించిన నోటితోనే నవ్వులు
సాక్షి టాస్క్ ఫోర్స్: నిన్నటి వరకు బహిరంగ వేదికలపై తిట్టుకున్న సత్యవేడు టీడీపీ నేతలు ఇప్పుడు ఒకే వేదికపై నవ్వులు చిందిస్తున్నారు. పదవుల పంపకంతో ఆధిపత్య పోరు కాస్తా, దోపిడీకి భాగస్వామ్యంగా మారిందని ఆ పార్టీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు.
నాడు శత్రుత్వం..
నేడు మిత్రత్వం
గతంలో తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనయుడు కోనేటి సుమన్ కుమార్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రధానంగా టీడీపీ సత్యవేడు ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ‘‘మేము ఎన్నికల్లో రూ.కోట్లు అప్పులు చేసి ఖర్చు చేశాం. అధికారం వచ్చాక మమ్మల్ని పక్కన పెట్టారు. మా డబ్బులు తిరిగి ఇస్తే రాజీనామా చేస్తాం’’ అని సుమన్ కుమార్ బహిరంగంగా సవాల్ విసిరాడు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఆదివారం తిరుపతిలోని టీడీపీ కార్యాలయంలో అదే శంకర్ రెడ్డి సమక్షంలో పార్టీ సత్యవేడు నియోజకవర్గం బీఎల్‌ఏ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించారు.
దోపిడీకేనా..?
రూ.కోట్లు ఖర్చు చేశామనిని బహిరంగంగా చెప్పిన ఎమ్మెల్యే తనయుడిపై టీడీపీ అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోలేదని పలువురు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పదవులు ఇచ్చి నగదు లెక్కను క్లోజ్ చేస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సత్యవేడులో గ్రావెల్, ఇసుక అక్రమ రవణా యథేచ్ఛగా సాగుతోంది. ఇఈ దందాల్లో వాటాల లెక్క తేలడంతోనే ఇప్పుడు రాజీ కుదిరిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.


