రామచంద్రాపురం : మండలంలోని మూడు ఆలయాల్లో శనివారం రాత్రి దుండగులు చోరీలకు పాల్పడ్డారు. వరుసగా ఆలయాల హుండీలను లక్ష్యంగా చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. మండలంలోని చల్లావారిపల్లి ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారికి అలంకరించిన 8 గ్రాముల బంగారు కాసులు, హుండీలోని రూ.20 వేల నగదును అపహరించారు. అలాగే తాటితోపు కండ్రిగలోని రాములవారి ఆలయం, అంకాలమ్మ ఆలయాల్లోని హుండీలను పగలగొట్టి, సుమారు రూ.4 వేల నగదును దోచుకెళ్లారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలాలకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలి ముద్రలను సేకరించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


