భూముల విలువల పెంపు నివేదిక ఇవ్వండి | Submit report on enhancement of land values: Deputy CM Bhatti meeting with Cabinet Sub-committee | Sakshi
Sakshi News home page

భూముల విలువల పెంపు నివేదిక ఇవ్వండి

Apr 11 2026 4:33 AM | Updated on Apr 11 2026 4:33 AM

Submit report on enhancement of land values: Deputy CM Bhatti meeting with Cabinet Sub-committee

మాట్లాడుతున్న భట్టి విక్రమార్క. చిత్రంలో ఉత్తమ్

తదుపరి కేబినెట్‌ భేటీలో చర్చకు అవసరమైన చర్యలు చేపట్టండి

మంత్రివర్గ ఉపసంఘం భేటీలో డిప్యూటీ సీఎం భట్టి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ప్రభుత్వ విలువల పెంపు కోణంలో జరిగిన అధ్యయన నివేదికను వెంటనే సమర్పించాలని, రానున్న కేబినెట్‌ సమావేశంలో ఈ నివేదికను ప్రవేశపెట్టి చర్చించేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. భూముల విలువల పెంపు ద్వారా ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడకుండా ఈ నివేదికలను తయారు చేయాలని ఆయన సూచించారు.

శుక్రవారం సచివాయంలో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఆదాయ సృష్టి, వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్‌ కె.రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాలతోపాటు ఆదాయార్జన శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా మెట్రో రైల్‌ స్వాధీనం, నిర్వహణ, ఆదాయ, వ్యయ మార్గాలపైన అధికారులతో మంత్రులు చర్చించారు. ఎక్సైజ్, రెవెన్యూ, పరిశ్రమల శాఖల్లో ఆదాయ పెంపునకు గల అవకాశాలు, ఫలితాలపై సమీక్షించారు. 

వనరుల సమీకరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోండి
ఈ సమీక్షలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ కృత్రిమ మేధ∙(ఏఐ) లాంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ఆదాయార్జన శాఖల రాబడులు, పన్నులు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. విజన్‌–2047 లక్ష్యంగా ఆదాయ పెంపునకు అవసరమైన వనరుల సమీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇసుక, క్రషర్‌ మైనింగ్‌ విభాగాల్లో అక్రమ రవాణా, ఓవర్‌ లోడ్‌లను నియంత్రించడం ద్వారా ఆదాయం పెంచాలని కోరారు.

వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కూడా ఆదాయం పెరుగుతోందని, ఈ శాఖల్లోనూ ఆదాయ వనరుల పెంపునకు గల అవకాశాలను అన్వేషించాలని సూచించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో భూముల విక్రయానికి సంబంధించిన ప్రచారాన్ని ప్రపంచ స్థాయిలో నిర్వహించాలని, అందరికీ ముందస్తు సమాచారం అందించడం ద్వారా ఆదాయ వనరులు పెరిగే అవకాశముంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement