కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు వద్ద మీర్‌ఖాన్‌పేట నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా రీజినల్ రింగ్ రోడ్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వేసవి సెలవులు తర్వాతకు వాయిదా వేసింది.
యాచారం మండలం కుర్మిద్ద గ్రామం, కడ్తల్ మండలంలోని కడ్తల్, ముద్విన్ గ్రామాలు, ఆమనగల్లు మండలంలోని ఆమనగల్లు, అకుతోటపల్లి గ్రామాల్లో 554.34 ఎకరాల భూమికి సంబంధించి ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ 98 ఏళ్ల వృద్ధురాలు అహల్యదేవి సహా మరో 30 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా, పిటిషనర్ల వ్యక్తిగత విచారణ జరపకుండా భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారన్నారు. సర్కార్ నిర్ణయం చట్టవిరుద్ధమైనదిగా, ఏకపక్షమైనదిగా, దురుద్దేశపూరితమైనదిగా ప్రకటించాలని కోరారు. విచారణ జరపకుండానే పిటిషనర్ల అభ్యంతరాలను తిరస్కరించడం సరికాదన్నారు. పిటిషనర్ల 61.24 ఎకరాల భూమికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సేకరిస్తున్న మొత్తం 554.34 ఎకరాల్లో 200 ఎకరాలు మాత్రమే వివాదాస్పదంగా ఉన్నాయని, 26 ఎకరాల ప్రాంతంలోని ఆస్తులకు ఇప్పటికే పరిహారం మంజూరు చేశామన్నారు. భూసేకరణ ప్రక్రియపై స్టే విధించొద్దని కోరారు. పరిహారం మంజూరు చేసే వరకు పిటిషనర్లను వారి భూముల నుంచి ఖాళీ చేయించమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.


