ఈ తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదు: మంత్రి ఉత్తమ్
నేడు మంత్రివర్గంలో చర్చించి అవసరమనుకుంటే సుప్రీంకు వెళ్తాం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవతకవలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు కేసీఆర్, హరీశ్‌రావులతో సహా బాధ్యులెవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. సీబీఐ విచారణకు హైకోర్టు తీర్పు అడ్డంకి కాదని తేల్చిచెప్పారు. గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో న్యాయస్థానం తీర్పుపై చర్చిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
నివేదికలో బాధ్యులైన కొందరికి కామెంట్స్, రిమార్క్స్ వారిని వేలెత్తి చూపించే అంశంలో 8బీ కింద నోటీసులు ఇవ్వలేదన్న సాంకేతిక కారణాలతో కోర్టు వారిపై చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పిందన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు కోరినట్లు కమిషన్ ఏర్పాటు జీవోను కొట్టేయాలన్న విజ్ఞప్తిని తిరస్కరించి.. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని న్యాయస్థానం తేల్చిందని చెప్పారు. బుధవారం సచివాలయంలో తన చాంబర్‌లో మంత్రి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
అంతకుముందు ఉత్తమ్ కోర్టు తీర్పు రాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమై చర్చించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని, కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతకవలకు సంబంధించి సీబీఐతో ప్రభుత్వం విచారణ జరిపించనున్నట్లు హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ లిఖితపూర్వకంగా అఫిడవిట్ ఇచ్చిన అంశాన్ని ఉత్తమ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పీసీ ఘోష్ నివేదికను న్యాయస్థానం తప్పుపట్టలేదని వెల్లడించారు. సాంకేతిక అంశాన్ని అడ్డంపెట్టుకుని బీఆర్‌ఎస్ నాయకులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడంలేదన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే కాళేశ్వరం నిర్మాణం, కూలడం రెండు జరిగిపోయాయని, ప్రాజెక్టు స్థలం మార్పు, డిజైన్ లోపాలతోనే కూలినట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) తేల్చిందని, అలాగే విజిలెన్స్ విచారణ, భారత కం్రప్టోలర్ ఆడిటర్ జనరల్ నివేదికలు.. అవకతవకలు జరిగాయని తేల్చినట్లు చెప్పారు. సీబీఐతో విచారణ జరిపించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు.
హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లి సీబీఐ విచారణ జరగకుండా బీజేపీ నేతలతో రహస్యంగా మంతనాలు జరిపి వచ్చారని ఆరోపించారు. కాగా, హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీతో ఉత్తమ్ ఫోన్‌లో చర్చించారు. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలో గురువారం కేబినెట్ సమావేశానికి ముందే అభిప్రాయం వెల్లడించాలని కోరినట్లు సమాచారం.


