నీట్‌–2026కు కౌంట్‌డౌన్‌ | NEET 2026 Admit Card Release on 27th April: Telangana | Sakshi
Sakshi News home page

నీట్‌–2026కు కౌంట్‌డౌన్‌

Apr 27 2026 6:13 AM | Updated on Apr 27 2026 6:13 AM

NEET 2026 Admit Card Release on 27th April: Telangana

నేటి నుంచి అడ్మిట్‌ కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో..

మే 3న జాతీయ స్థాయి పరీక్ష

మే 2, 3 తేదీల్లో మెడికల్‌ విద్యార్థులకు సెలవుల్లేవ్‌

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్యలో ప్రవేశాలకు గేట్‌వేగా నిలిచే ‘నీట్‌–యూజీ 2026’ పరీక్షకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఈ పరీక్ష మే 3న దేశవ్యాప్తంగా జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఒకే షిఫ్ట్‌లో ఆఫ్‌లైన్‌ (పెన్‌–పేపర్‌) విధానంలో పరీక్ష జరగనుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశవ్యాప్తంగా 22 లక్షలకుపైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇదే ప్రధాన ప్రవేశ పరీక్ష. గత ఏడాది తెలంగాణ నుంచి 70 వేల మందికిపైగా విద్యార్థులు నీట్‌ పరీక్ష రాయగా, ఈసారి 75 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని వైద్య విద్య వర్గాలు చెబుతున్నాయి. 

నేడు 10 గంటల నుంచి..
నీట్‌–2026 అడ్మిట్‌ కార్డులు సోమవారం (ఏప్రిల్‌ 27) ఉదయం 10 గంటల నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ వెల్లడించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రం, సమయం వంటి కీలక వివరాలు అందులో ఉంటాయి. పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్‌టీఏ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. నిషేధిత వస్తువులు తీసుకొస్తే డిస్క్వాలిఫికేషన్‌ తప్పదని హెచ్చరించింది. అలాగే కేంద్రాల్లో ఫ్రిస్కింగ్‌ విధానం అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

అవకతవకలకు తావులేకుండా.. 
నీట్‌–యూజీ పరీక్షను పారదర్శకంగా, ఎలాంటి అవకతవ కలకు తావులేకుండా నిర్వహించేందుకు కీలక చర్యలు చేప ట్టారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను మే 3న నిర్వహించనున్నందున జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ముందు జాగ్రత్తగా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మే 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు సెలవులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. గతంలో నీట్‌ పరీక్షల సందర్భంగా చోటుచేసుకున్న ఇంపర్సనేషన్, చీటింగ్, ప్రశ్నపత్రాల లీక్‌ వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ఎంసీ పేర్కొంది.

ముఖ్యంగా మెడికల్‌ విద్యార్థుల ప్రమేయంతో జరిగే అవకతవకలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో సరైన కారణాలు ఉంటేనే సంబంధిత కాలేజీ యాజమాన్యాలు సెలవులు మంజూరు చేయొచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ రెండు రోజుల్లో విద్యార్థులను కళాశాలల్లోనే ఉంచుతూ అకడమిక్‌ కార్యక్రమాలు లేదా ఇతర పనుల్లో నిమగ్నం చేయాలని సూచించింది. అవసరమైతే బోధన, నాన్‌–టీచింగ్‌ సిబ్బందిని కూడా విధుల్లో ఉంచాలని పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement