హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇటీవల హృదయవిదారక ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒక తల్లి గుండెల్లో దాగిన బాధ ఎంత లోతుగా ఉంటుందో బయటివారికి కనిపించకపోవచ్చు. కానీ ఆ బాధ ఓ కుటుంబాన్నే శోకసంద్రంలో ముంచేసేంత తీవ్రంగా మారితే? అదే జరిగింది. మియాపూర్‌లో ఇటీవల జరిగిన ఓ ఘటనలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం అందరినీ కలచివేస్తుండగా, ఆమె పసిపాప భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు తాజాగా ఆమె భర్తను రిమాండ్‌కు తరలించారు.
కేసు ఏంటి?
ఓ మహిళ తన ఆరు నెలల పాపతో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మియాపూర్‌లోని మయూరి నగర్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్ వద‍్ద చోటుచేసుకుంది. తన ఆరు నెలల పాపతో ఆరో అంతస్తు నుంచి దూకిన ఈషా సాహు (37) అక్కడికక్కడే మృతిచెందగా, గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఆమె పాప.
రెండో కూతురు పుట్టిందని ఈషా సాహును భర్త భూపేంద్ర సాహు వేధించడమే ఈ ఘటనకు కారణమని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి భూపేంద్ర సాహును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


