ఐఐఎం ముంబై తీరుపై కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఓ అభ్యర్థి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలైన ఐఐఎంలలో ప్రవేశాల ప్రక్రియ వివాదాస్పదంగా మారుతోంది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ‘క్యాట్’లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కాదని, అహేతుక నిబంధనలతో మెరిట్‌ను కాలరాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐఐఎం ముంబై అనుసరిస్తున్న విధానాలపై విచారణ జరపాలని కోరుతూ ఒక బాధిత విద్యార్థి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు మార్చి30న ఫిర్యాదు చేశారు.
కాగా, ఇదే అంశానికి సంబంధించి ఇటీవల ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. అత్యంత క్లిష్టమైన పరీక్షగా పరిగణించే క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్)లో 99.52 పర్సంటైల్ సాధించినప్పటికీ, తనకు కనీసం ఇంట ర్వ్యూ (పీఐ) పిలుపు కూడా రాకపోవడంపై హైదరాబాద్ గుండ్ల పోచంపల్లికి చెందిన సత్యసాయి కటారు అనే అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత స్కోరు సాధించిన విద్యార్థులను పక్కనపెట్టి, తక్కువ పర్సంటైల్ వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వ డం రాజ్యాంగంలోని 14వ అధికరణం (సమానత్వపు హక్కు) కింద కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, ఐఐఎంలు క్యాట్ స్కోరుకు కేవలం 30 శాతం నుంచి 60 శాతం మాత్రమే వెయిటేజీ ఇస్తున్నాయని, పదేళ్ల క్రితం పూర్తి చేసిన 10వ, 12వ తరగతి మార్కులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అభ్యర్థి ప్రశ్నించారు. వివిధ బోర్డుల మధ్య మూల్యాంకన విధానాల్లో వ్యత్యాసాలు ఉన్నప్పుడు, పాత అకడమిక్ రికార్డులను ప్రామాణికంగా తీసు కోవడం గ్రామీణ, వెనుకబడిన విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని పేర్కొన్నారు.
చదవండి: జేఈఈ మెయిన్స్ ఆఫ్‌లైన్‌లో పెట్టలేరా?
ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం ఐఐఎం ముంబై యాజమాన్యం సరిగ్గా అమలు చేయలేదని బాధితుడు ఫిర్యాదు చేశారు. తాను దరఖాస్తు చేయని కోర్సులో ఇంటర్వ్యూ ఇస్తామంటూ తప్పుడు సమాచారంతో కోర్టును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే జోక్యం చేసుకొని న్యాయం చేయాలని బాధితుడు కోరారు.


