రైతులంతా టెక్‌ నిపుణులు కాదు | High Court seeks govt reply on urea shortage and booking app | Sakshi
Sakshi News home page

రైతులంతా టెక్‌ నిపుణులు కాదు

Apr 24 2026 3:08 AM | Updated on Apr 24 2026 3:08 AM

High Court seeks govt reply on urea shortage and booking app

నిరక్షరాస్యులు యాప్‌లో యూరియా ఎలా బుక్‌ చేసుకుంటారన్న హైకోర్టు 

రైతులందరి వద్ద స్మార్ట్‌ ఫోన్‌ ఉండదు 

ఇలాంటి యాప్‌లపై ప్రచార బాధ్యతా సర్కార్‌దే 

ఒక రైతుకు.. ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా ఇస్తారు? 

సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రైతులందరూ సాంకేతిక నిపుణులు కారని, అందరి వద్దా స్మార్ట్‌ ఫోన్‌ ఉండదని.. యాప్‌లో యూరియా ఎలా బుక్‌ చేసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి యాప్‌లు తీసుకొచ్చినప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా సర్కార్‌దేని స్పష్టం చేసింది. హోర్డింగ్‌లు, ప్రింట్‌ అండ్‌ ఎల్రక్టానిక్‌ మీడియా ద్వారానో.. గ్రామ కార్యాలయాల్లో బుకింగ్‌ విధానాన్ని అందుబాటులో ఉంచడం ద్వారానో ప్రచారం కల్పించాలని పేర్కొంది. 

సబ్సిడీ యూరియాను ఎవరెవరికి ఇస్తున్నారు? ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉంది? యుద్ధం వేళ ఇబ్బందులు రాకుండా ఏవైనా చర్యలు తీసుకున్నారా? ఒక రైతుకు.. ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా ఇస్తారు? తదితర సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత, బుకింగ్‌ సమస్యను సవాల్‌ చేస్తూ నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సహా మరికొందరు రైతులు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 

తాము అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ధర్నా నిర్వహించినా పట్టించుకోకపోవడంతో తప్పనిస్థితిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. తొలుత రిజిస్ట్రీ నంబర్‌ కేటాయించేందుకు నిరాకరించగా, సీజే ఆదేశంతో నంబర్‌ నమోదు చేసింది. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.  

కౌలు, అసైన్డ్‌ రైతులకు ఇవ్వడం లేదు  
పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. యూరియా కొనుగోలులో సమస్యలను రైతులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వారు పట్టించుకోలేదన్నారు. రైతుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కావడంతో అధికారులు, నెట్‌ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. ‘రైతులకు ఎలాంటి ఆటంకాలు లేదా ఇబ్బందులు కలగకుండా ఉండేలా, ప్రస్తుత ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ను తప్పనిసరి కాకుండా ఐచ్ఛికంగా మార్చేలా సాంకేతికంగా మెరుగుపరచాలి. 

స్మార్ట్‌ఫోన్‌న్లు లేని రైతులకు, అలాగే ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా యూరియాను బుక్‌ చేసుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం లేని వారికి సౌకర్యం కల్పించేందుకు, అ«దీకృత ఎరువుల డీలర్లు, వ్యవసాయ కార్యాలయాలు, రైతు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఆఫ్‌లైన్‌ వ్యవస్థలో పంపిణీ చేయడానికి తగినంత పరిమాణంలో యూరియాను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలి. కౌలు రైతులకు కూడా యూరియాను నిరాకరించకుండా అందించేలా ఉత్తర్వులు జారీ చేయాలి’అని కోరారు.  

మెరుగైన సరఫరాకే యాప్‌.. 
జీపీ మోహనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. యూరియాపై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని.. మెరుగైన సరఫరాకే యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. బస్తా ధర రూ.3 వేలు ఉండగా, రూ.266కే రైతుకు అందిస్తున్నామని.. ఇది కేవలం రైతుకు దక్కాలన్నది సర్కార్‌ ఉద్దేశమన్నారు. పాస్‌బుక్‌ నంబర్, ఎకరాల ఆధారంగానే సరఫరా చేస్తున్నామని చెప్పారు. గతంలో కంటే అధిక మొత్తంలోనే అందజేస్తున్నామన్నారు. యాప్‌పై అవగాహన లేని వారికి యూరియా కేంద్రంలోని వలంటీర్లు సాయం చేస్తారన్నారు. 

అసైన్డ్‌ భూమి ఉన్న రైతులకు ఇవ్వడం లేదని పిటిషనర్‌ న్యాయవాది పేర్కొనగా.. వివరాలు తెలుసుకొని సమర్పిస్తానని జీపీ తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇలాంటి యాప్‌లు తీసుకొచ్చినప్పుడు రైతుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం, ప్రింట్, ఎల్రక్టానిక్‌ మీడియాలో బుకింగ్‌పై ప్రచారం కల్పించాలని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement