గోదాముల్లో అగ్ని కీలలు | Fire breaks out at chemical solvent unit in Hyderabad Jeedimetla | Sakshi
Sakshi News home page

గోదాముల్లో అగ్ని కీలలు

Apr 10 2026 6:05 AM | Updated on Apr 10 2026 6:05 AM

Fire breaks out at chemical solvent unit in Hyderabad Jeedimetla

జీడిమెట్ల, బహదూర్‌పల్లిలో భారీ ప్రమాదాలు  

రసాయనాల గోడౌన్‌లో ఎగిసిపడిన మంటలు 

కాలిపోయిన డెకరేషన్‌ ఈవెంట్స్‌ సామగ్రి  

దగ్ధమైన ఐదు వాహనాలు  

బహదూర్‌పల్లిలో రూ.కోటి, జీడిమెట్లలో రూ 30 లక్షల ఆస్తి నష్టం

జీడిమెట్ల/జగద్గిరిగుట్ట: నగరంలో గురువారం వేర్వేరు ప్రాంతాల్లో రెండు భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జీడిమెట్లలోని రసాయన గోదాములో ఫ్యాబ్రికేషన్‌ పరిశ్రమతో పాటు మరో మూడు గోదాముల్లో అగ్ని ప్రమాదం సంభవించింది.  జగద్గిరిగుట్ట పరిధిలోని బహదూర్‌పల్లిలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్‌ సామగ్రితో పాటు రెండు వాహనాలు బుగ్గి పాలయ్యాయి. సుమారు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జీడిమెట్లలోని ఏస్వీకో ఆపరేటివ్‌ సొసైటీలో రాజేష్‌ అనే వ్యక్తి రసాయన గోదామును నడుపుతున్నాడు.

గురువారం ఉదయం 7 గంటలకు గోదాములో రసాయనాలు, సాల్వెంట్లను కలుపుతుండగా మంటలు అంటుకున్నాయి. డ్రమ్ముల్లో రసాయనాలు ఉండటం, దానికి ఆనుకుని ఉన్న మరో రసాయన గోదాములో రసాయనాల నిల్వలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. మంటల తాకిడికి రెండు రసాయన గోదాములతో పాటు ఠాగూర్‌ కెమికల్స్‌కు చెందిన ఆర్‌ అండ్‌ డీ ల్యాబ్, ఇస్మాయిల్‌ అనే వ్యక్తికి చెందిన మెడికల్‌ వేస్ట్‌ గోదాము, హనుమాన్‌ ఫ్యాబ్రికేషన్‌ పరిశ్రమకు మంటలు అంటుకున్నాయి.

విషయం తెలుసుకున్న జీడిమెట్ల, సనత్‌నగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలిని కుత్బుల్లాపూర్‌ ఏసీపి బాలగంగిరెడ్డి, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేష్, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ నితిన్‌లు పర్యవేక్షించారు.  

ప్రాణాలతో బయటపడిన 45 మంది..
బహదూర్‌పల్లిలోని డెకరేషన్‌ ఈవెంట్‌ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయగిరి కాలనీలో వెంకటేష్‌ అనే వ్యక్తి ఎస్‌వీఎన్‌ పేరిట డెకరేషన్‌ ఈవెంట్‌ గోదాం నడుపుతున్నాడు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో గోదాం పక్కనే ఉన్న విద్యుత్‌ వైర్ల వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ మంటలు చెలరేగాయి.  డెకరేషన్‌ సామగ్రితో పాటు, కారు, టాటా ఏసీ వాహనం అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. కాగా.. గోదాముకు ఆనుకొని ఉన్న గోకులం రెసిడెన్సీ భవనం రెండంతస్తుల వరకు మంటలు వ్యాపించి డోర్లు, కిటికీలు  కాలి బూడిద అయ్యాయి. భవనంలోని 45 మంది  వెనక నుంచి గ్రిల్స్‌ తొలగించుకొని బయటపడ్డారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాముకు ఎవరో కావాలనే నిప్పు పెట్టారని యజమాని  వెంకటేష్‌ ఆరోపించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement