పిల్లనిచ్చి వరకట్నంగా కుక్కలు.. | Sakshi
Sakshi News home page

పిల్లనిచ్చి వరకట్నంగా కుక్కలు..

Published Thu, Apr 20 2023 2:49 AM

Dogs As Wedding dowry Tradition At Rajanna Sircilla district - Sakshi

సిరిసిల్ల: శునకాలను కొందరు అభిరుచికొద్దీ, ఇంకొందరు ఇంటికి రక్షణ కోసం పెంచుకుంటారన్న విషయం తెలిసిందే. కానీ.. శునకరాజాలను ఆస్తిగా భావిస్తూ.. ఆడపిల్లలకు కట్నంగా కూడా ఇచ్చే కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్లెవరూ, వారి జీవనశైలి ఏమిటి? తెలుసుకోవాలనుకుంటున్నారా..! 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు గ్రామాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే గంగిరెద్దుల కుటుంబాలు ఉన్నాయి. కోనరావుపేట మండలం కొండాపూర్, బావుసాయిపేట, చందుర్తి మండలం రామారావుపల్లె గ్రామాల్లో దాదాపు వంద కుటుంబాలు నివసిస్తున్నాయి.

ఈ మూడు పల్లెలకు చెందిన గంగిరెద్దుల కుటుంబాల వారు జిల్లావ్యాప్తంగా భిక్షాటన చేస్తారు. ఆహారాన్ని సేకరించి కుక్కలను పోషిస్తారు. ఈ కుక్కలను వేటకు, వారు నివాసం ఉండే గుడారాల రక్షణకు ఉపయోగిస్తారు. ఒక్కో కుటుంబంలో ఐదు నుంచి పది, పదిహేను, ఇరవై.. శునకాలను పెంచుతుంటారు. అయితే శునకాలనే ఆస్తిలా భావించే ఈ ఆచారం గంగిరెద్దుల కుటుంబాల్లో తరతరాలుగా కొనసాగుతోంది. ఎన్ని ఎక్కువ శునకాలను పెంచితే అంత ఆస్తిపరులన్న మాట.

వారు పోషిస్తున్న శునకాల సంఖ్యను బట్టే ఆ కుటుంబపెద్దకు వారి కులంలో గౌరవం లభిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఆడ పిల్లలకు పెళ్లిలో కట్నంగా శునకాలను ఇచ్చే సంప్రదాయం ఈ కుటుంబాల్లో ఉంది. అయితే ఇప్పుడిప్పుడే ఆ కుటుంబాల్లో మార్పు వస్తోంది. వ్యవసాయం చేస్తూ కొందరు.. చిన్న చిన్న బుట్టల్లో ప్లాస్టిక్‌ సామగ్రి అమ్ముతూ, కొబ్బరి కుడుకలకు బదులు చక్కెర ఇçస్తూ కొందరు జీవనం సాగిస్తున్నారు.  

ఒకప్పుడు ఎక్కువగా ఉండేవి.. 
మాకు కుక్కలను పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటి ముందు ఎన్ని ఎక్కువ కుక్కలుంటే అంత విలువ ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ తక్కువ. కాలం మారినా.. మాకు కుక్కలు ఉండాల్సిందే. మేం ఏం తింటే అదే వాటికి పెడతాం. మాతోనే ఉంటాయి. మేం ఏ ఊరికి వెళ్తే.. ఆ ఊరికి మా వెంట వస్తాయి.  
  – టేకుమల్ల రాజయ్య, సంచార జీవి. 

శునకాలే మా ఆస్తి..
మునుపు ఎక్కువ కుక్కలను పెంచేటోళ్లం. షికారీ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు మావోళ్లు సోకులకు వచ్చిండ్రు. కుక్కలను ఎక్కువ సాదుత లేరు. వ్యవసాయం చేస్తుండ్రు. కుడుకలకు చక్కరి అమ్ముతూ.. బతుకుతుండ్రు. బిచ్చం ఎత్తడం లేదు. అయినా మాకు కుక్కలతోనే ధనం. 
– గంట లచ్చయ్య, బావుసాయిపేట.  

Advertisement
Advertisement