బాల్య వివాహాల్లో అన్ని వర్గాల్లోనూ దాదాపు సమానమే! | Child Marriages in Telangana State | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల్లో అన్ని వర్గాల్లోనూ దాదాపు సమానమే!

Apr 17 2026 6:02 AM | Updated on Apr 17 2026 6:02 AM

Child Marriages in Telangana State

నాలుగు శాతం మేరకు బాల్య వివాహాలు

జోరందుకుంటున్న కులాంతర వివాహాలు 

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ బీసీలే అధికం

ఎస్‌ఈఈఈపీసీ–2024 సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: బాల్య వివాహాల్లో ఉన్నత, వెనుకబడిన వర్గాలు అనే తేడా లేకుండా రాష్ట్రంలో జరుగుతున్నట్లు ప్రభుత్వం నిర్వహించిన ఎస్‌ఈఈఈపీసీ– 2024 సర్వేలో స్పష్టమైంది. బాల్య వివాహాలను అడ్డుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నా.. చట్టాలు ఉన్నా ఇంకా కొనసాగుతున్నట్టు వెల్లడైంది. బాల్య వివాహాల్లో వెనుకబడిన తరగతుల్లో 4.6 శాతం, దళితుల్లో నాలుగు శాతం, గిరిజనుల్లో 3.9 శాతం ఉంటే.. ఇతర కులాల్లో 4.4 శాతం మేరకు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్వేల్లో స్పష్టం చేసింది.

అక్షరాస్యతలో ముందుందని భావిస్తున్న ఇతర కులాల్లో (ఓసీ) ఈ బాల్య వివాహాల రుగ్మత ఎక్కువగానే ఉండడం గమనార్హం. నిరక్ష్యరాస్యులున్న చిన్నారుల్లో ఈ నాలుగు కేటగిరీల్లో దాదాపు సమానంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. చిన్నారుల నిరక్షరాస్యతలో ఎస్టీ, ఇతర కులాలు చెరో 3.7 శాతం మేరకు ఉన్నట్లు తేలింది. అదే వెనుకబడిన తరగతుల్లో 3.6శాతం, దళితుల్లో 3.3 శాతం చిన్నారులు నిరక్షరాస్యులుగా ఉన్నారు. ఇంగ్లిష్‌ మీడియం చదివేవారిలో ఓసీలు అత్యధికంగా 66.3 శాతం ఉంటే.. అత్యల్పంగా ఎస్టీలు 36.6 శాతం ఉన్నారు.

దినసరి కూలీల్లో ఎస్సీలు అత్యధికంగా 45.7 శాతం, గిరిజనులు 40.6 శాతం మంది జీవనధారం రోజువారీ కూలీ పనిపైనే ఆధారపడి ఉన్నారు. సొంత మధ్య, భారీ వ్యాపారాలున్న వారి సంఖ్య అన్ని కేటగిరీల్లో కేవలం 0.00 శాతం నుంచి 0.06 శాతం మాత్రమే ఉన్నారు. రిఫ్రిజిరేటర్లు ఓసీ కులాల్లో 33.7 శాతం ఉంటే.. బీసీల్లో 23.6 శాతం ఉన్నారు. వివాహాలు, వైద్య ఖర్చుల కోసం రుణాలు తీసుకుంటున్న వారిలో బీసీలు 7.3 శాతం ఉంటే.. దళితుల్లో 10.9 శాతం, ఎస్టీలు 6.9 శాతం. ఓసీలు మూడు శాతం ఉన్నట్టు వెల్లడించింది. ఆదాయ పన్ను చెల్లింపుదారుల్లో ఓసీలు 23.5 శాతం, వెనుకబడిన తరగతులు 7.9 శాతం, ఎస్సీలు 6 శాతం, ఎస్టీలు ఐదు శాతం ఉన్నట్లు వివరించింది. 

Advertisement
 
Advertisement
Advertisement