మాజీ ఎమ్మెల్యే తనయుడి లొంగుబాటు | Bodhan Ex MLA Shakeel Son Surrender Hit And Run Case | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే తనయుడి లొంగుబాటు

Apr 18 2026 8:12 AM | Updated on Apr 18 2026 11:52 AM

 Bodhan Ex MLA Shakeel Son Surrender Hit And Run Case

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతికి సంబందించిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు మహ్మద్‌ రాహిల్‌ అమిర్‌ 2022 మార్చి 17న రాత్రి 8 జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–45 మీదుగా ఫిలింనగర్‌ వైపు కారులో వెళుతూ పసికందును ఎత్తుకుని రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు నడిపిస్తున్న వ్యక్తి కారు అక్కడే వదిలి పారిపోయాడు. 

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కారుపై బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పేరుతో ఉన్న స్టిక్కర్‌ ఆధారంగా ప్రమాదానికి కారకుడైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. నాలుగు బృందాలను ఏర్పాటుచేసి 100 కెమెరాలను జల్లెడ పట్టారు. కారులో అఫ్రాన్, రాహిల్, మహ్మద్‌ మాజ్‌ ఉన్నట్లుగా గుర్తించారు. కారును తానే నడిపినట్లు అఫ్రాన్‌ తప్పుడు సమాచారం ఇచ్చాడు. తాను డ్రైవింగ్‌ చేస్తుండగా రాహిల్‌ పక్కన కూర్చున్నట్లు చెప్పాడు. అయితే పోలీసుల దర్యాప్తులో సీసీ కెమెరాల్లో కారును రాహిల్‌ నడుపుతున్నట్లుగా స్పష్టమైంది.

 ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడి సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి పరారీలో ఉండటంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన రోజున డ్రైవింగ్‌ సీటు నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితులు చెప్పడంతో పోలీసులు షకీల్‌ కుమారుడే ప్రమాదానికి పాల్పడి ఉంటాడని నిర్థారణకు వచ్చి సీసీ ఫుటేజీలను, కాల్‌ డేటాను పరిశీలించారు. రాహిల్‌ పోలీసులను తప్పుదోవ పట్టించి డ్రైవర్‌ స్థానాన్ని మార్చినట్లు నిర్థారణకు వచ్చి కేసు నమోదు చేశారు. 

అయితే అప్పటి నుంచి రాహిల్‌ దుబాయ్‌లో తలదాచుకున్నాడు. పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఇటీవల హైకోర్టు ఆదేశించడంతో శుక్రవారం నిందితుడు జూబ్లీహిల్స్‌ పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడి నుంచి సంబంధిత పత్రాలను స్వా«దీనం చేసుకుని దర్యాప్తునకు సహకరించాల్సిందిగా సూచించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement