వలస కార్మికులకు బహ్రెయిన్‌ షాక్‌ 

Bahrain Govt Refused To Give Work To Those On Visit Visa - Sakshi

అర్ధాంతరంగా వర్క్‌ వీసాల రద్దు  

విజిట్‌ వీసాలపై వచ్చిన వారికి పనులివ్వొద్దని కంపెనీలకు సర్కార్‌ ఆదేశం 

తిరిగి ఇంటికి చేరుకుంటున్న కార్మికులు 

నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండ­లం తొర్తికి చెందిన కొట్టూరి శ్రీకాంత్‌ రెండు నెలల కిందట విజిట్‌ వీసాపై బహ్రెయిన్‌ వెళ్లాడు. అక్కడ ఏదో ఒక కంపెనీలో పని చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ విజిట్‌ వీసాపై వచ్చిన వారికి పని ఇవ్వడానికి కంపెనీలు నిరాకరించాయి. ఫలితంగా విజిట్‌ వీసా గడువు ముగిసేలోపు శ్రీకాంత్‌ ఇంటికి చేరుకున్నాడు. బహ్రెయిన్‌కు వెళ్లడానికి రూ.లక్ష వరకు ఖర్చు చేయగా ఈ డబ్బును శ్రీకాంత్‌ నష్టపోవాల్సి వచ్చింది. 

మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఎండీ ఇబ్రహీం కొన్నేళ్ల నుంచి బ­హ్రె­యిన్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా ప­నిచేస్తున్నాడు. ఆరు నెలల కిందట ఇంటికి వచ్చి మళ్లీ బహ్రెయిన్‌ వెళ్లాడు. అ­త­నికి మరో రెండేళ్ల వరకు అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది. కానీ అ­క్క­డి ప్రభుత్వ ఆధీనంలోని లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అ­థారిటీ (ఎల్‌ఎంఆర్‌ఏ) అనేక మంది వలస కార్మికుల వీసాలను అర్ధంతరంగా రద్దు చేసింది.

ఫలితంగా ఇబ్రహీం ఇంటికి వచ్చేశాడు. విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బహ్రెయిన్‌లో పర్యాటక రంగం వృద్ధి చెందడంతో ఆ దేశానికి వెళితే ఏదో ఒక పని చేసుకోవచ్చని వలస కా­ర్మికులు ఆశిస్తున్నారు. అదే ఆశతో విజిట్‌ వీసాపై వెళ్లిన శ్రీ­కాంత్‌ ఇంటి దారి పట్టగా, వర్క్‌ వీసాకు గడువున్నా ఇ­బ్రహీం కూడా బలవంతంగా ఇంటికి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం వందలాది మంది ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. 

మోర్తాడ్‌ (బాల్కొండ): బహ్రెయిన్‌లో ఉపాధి పొందవచ్చని భావిస్తున్న ఎంతో మంది వలస కార్మికులకు అక్కడి ప్రభుత్వం షాకిస్తోంది. యూ­ఏ­­ఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, ఒ­మా­న్‌ల మాదిరిగానే బహ్రెయిన్‌ కూడా ఎంతో మంది తెలుగువారికి ఉపాధి అవకాశాలు కల్పించింది. అయితే ఇకనుంచి అది చరిత్రగానే మిగిలిపోనుంది. బహ్రెయిన్‌ ప్రభుత్వం తీసుకున్న క­ఠిన నిర్ణయాలు, వలస కార్మికుల వీసాలను పర్యవేక్షించే లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అథారిటీ అనుసరిస్తున్న విధానాలతో బహ్రెయిన్‌లో ఉపా­ధి మార్గా­లు మూసుకుపోతున్నాయి.

వారం, పది రోజుల వ్యవధిలోనే తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికులు దాదాపు రెండు వేలమంది బ­హ్రెయిన్‌ నుంచి ఇంటిదారి పట్టారని అంచనా. వర్క్‌ వీసాలను రద్దు చేయడం, విజిట్‌ వీసాలపై వెళ్లి పని వెతుక్కునేవారికి ఎల్‌ఎంఆర్‌ఏ ఇచ్చిన ఆదే­శాలతో కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించ­డంతో ఉపాధి కరువైంది. బహ్రెయిన్‌ ప్ర­భు­త్వం పునరాలోచన చేస్తే తప్పా ఆ దేశంలో వలస కార్మికుల ఉపాధికి అవరోధాలు తప్పవని అభిప్రా­యం వ్యక్తమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బహ్రెయిన్‌కు వెళ్లే ఆలోచన మానుకోవాలని వలస కార్మికుల సంఘాలు సూచిస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top