
పెరుంగళత్తూరు– పుళల్ బైపాస్ రోడ్డు
సాక్షి, చైన్నె: చైన్నె పెరుంగళత్తూరు – పుళల్ బైపాస్ రోడ్డుకు కొత్త శోభను సంతరించుకోనుంది. విద్యుత్ వెలుగుల కోసం రూ. 15 కోట్లతో ఒప్పందాలను రహదారుల శాఖ ఖరారు చేసింది. వివరాలు.. చైన్నె నగరంలో రద్దీ నియంత్రణ కోసం కొన్నేళ్ల క్రితం దక్షిణం వైపుగా ఉన్న పెరుంగళత్తూరు నుంచి ఉత్తరం వైపు గా ఉన్న పుళల్ వరకు 32 కి.మీ దూరం జాతీయ రహదారిగా బైపాస్ రోడ్డు ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ మార్గం పోరూర్, మదురవాయిల్, అంబత్తూరును కలుపుతూ రూపుదిద్దుకుని ఉంది.
కోయంబేడు నుంచి దక్షిణ తమిళనాడులోని జిల్లాలు, నగరాలకు జాతీయ రహదారి వైపుగా వెళ్లే వాహనాలు మదుర వాయిల్ వద్ద ఈ బైపాస్‌లో కలుస్తాయి. ఈ మార్గంలో పోరూర్, పుళల్ వద్ద రెండు టోల్‌గేట్లు సైతం ఉన్నాయి. టోల్ గేట్ల వద్ద మాత్రమే విద్యుత్ దీపాలు ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించవు. ఫలితంగా రాత్రులలో ఈమార్గంలో ద్విచక్ర వాహన దారులు వెళ్లాలంటే భయాందోళన చెందుతుంటారు. ఈ బైపాస్‌లో పోరూర్, మదుర వాయిల్, అంబత్తూరు వద్ద మాత్రమే వాహనాలు ప్రవేశించేందుకు ప్రత్యేక మార్గాలు ఉన్నాయి. చిమ్మ చీకటితో నిండిన ఈ బైపాస్ మార్గంలో రాత్రుళ్లలో ప్రమాదాలు, అసాంఘిక కార్యక్రమాలు నిత్యకృత్యంగా మారాయి. దీంతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్పందించిన రహదారుల శాఖ
వాహనదారుల విజ్ఞప్తులకు రహదారుల శాఖ స్పందించింది. పెరుంగళత్తూరు సమీపంలోని వండలూరు నుంచి మీంజూరు వరకు రూపుదిద్దుకున్న ఔటర్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో ఉన్నట్టుగానే ఈ బైపాస్ రోడ్డులోనూ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పెరుంగళత్తూరు నుంచి – పుళల్ వరకు రూ. 14.82 కోట్లతో 2,133 చోట్ల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 10 మీటర్ల ఎత్తుతో కూడిన 1,033 స్తంభాలను ఇరు వైపులా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసే విధంగా అమర్చనున్నారు. అలాగే 9 మీటర్ల ఎత్తులో 341 విద్యుత్ స్తంభాలను ప్రధాన ప్రాంతాల్లో అమర్చనున్నారు. ఐదు నెలల్లో ఈ పనులు ముగించే విధంగా ఒప్పందాలను రహదారుల శాఖ ఖరారు చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.