ప్రసన్నతో కాకాణి భేటీ | - | Sakshi
Sakshi News home page

ప్రసన్నతో కాకాణి భేటీ

Jun 11 2026 12:07 AM | Updated on Jun 11 2026 12:07 AM

నెల్లూరు రూరల్‌: మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో నగరంలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. పార్టీ బలోపేతానికి చేపట్టనున్న కార్యాచరణపై సమీక్షించారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ కార్యక్రమంపై బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు అవగాహన కల్పించే చర్యలపై చర్చించారు. కోవూరులో శుక్రవారం నిర్వహించనున్న వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన చర్యలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ శ్రేణుల సమన్వయంపై మాట్లాడారు.

జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ల నియామకం

నెల్లూరు (లీగల్‌): స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్లను నియమిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. నెల్లూరులోని వేదాయపాళేనికి చెందిన రిటైర్డ్‌ న్యాయశాఖ ఉద్యోగి కొల్లూరి నరసింహరావును నెల్లూరు స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌గా.. ఒంగోలుకు చెందిన నాన్‌ ప్రాక్టీస్‌ న్యాయవాది కోలా ఉమామహేశ్వరరావును కోవూరు జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌గా నియమించారు. కాగా వీరు ఏడాది పాటు కొనసాగనున్నారు.

వడ్డెర్లకు త్వరలో

పరికరాల పంపిణీ

నెల్లూరు(వేదాయపాళెం): వడ్డెర్ల జీవనశైలికి అవసరమైన పరికరాలను త్వరలో అందజేయనున్నామని జిల్లా వెనుకబడిన తరుగతుల సేవా సహకార సంఘ లిమిటెడ్‌ ఈడీ నిర్మలాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు గానూ వీటిని అందజేయనున్నామని వివరించారు. ఆదరణ పథకం అమలుకు సమావేశాలను ప్రభుత్వం నిర్వహించనుందని, విధివిధానాలు ఖరారైన అనంతరం వీటిని పంపిణీ చేయనున్నామని వెల్లడించారు.

కండలేరులో

36.66 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారానికి 36.660 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1900, హై లెవల్‌, లోలెవల్‌ కాలువలకు 50 చొప్పున, పిన్నేరు కాలువకు ఐదు, మొదటి బ్రాంచ్‌ కాలువకు 85 క్యూసెక్కుల మేర విడుదల చేస్తున్నామని వెల్లడించారు.

వైఎస్సార్సీపీ నుంచి సస్పెన్షన్‌

నెల్లూరు రూరల్‌: పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనల నేపథ్యంలో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ హంషీద్‌ అలీని సస్పెండ్‌ చేశామని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆదేశాలు, క్రమశిక్షణ నియమావళిని పాటించకుండా పార్టీ నేతలపై సోషల్‌ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని తీవ్రంగా పరిగణించామని పేర్కొన్నారు. ఈ క్రమంలో సస్పెన్షన్‌ వేటేశామని వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement