ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం మైఖేల్ వాన్ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని మరోసారి కెలికాడు. తాజాగా తన దేశానికే చెందిన సామ్ బిల్లింగ్స్ విరాట్‌ను పొగుడుతూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేయగా.. అందుకు బదులుగా వ్యంగ్యంగా స్పందించాడు.
తాజాగా గుజరాత్‌పై విరాట్ మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ చేసిన అనంతరం సామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఇందులో "ఫుల్ ఫ్లోలో ఉన్న విరాట్‌ను చూడటం కంటే గొప్పది ఏముంటుంది..?" అని రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన వాన్, "ఉంది.. జో రూట్" అంటూ విరాట్‌పై అక్కసును వెళ్లగక్కాడు.
వాస్తవానికి వాన్‌కు విరాట్‌ను కెలకడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. విరాట్‌కు ఫాబ్-4లో ఉండే అర్హత లేదంటూ కొన్ని సార్లు.. విరాట్ ఫాబ్-4లో అథముడని మరికొన్ని సార్లు కామెంట్లు చేశాడు.
తాజాగా విరాట్ కంటే రూట్ చాలా బెటర్ అన్న అర్దం వచ్చేలా బిల్లింగ్స్ ట్వీట్‌పై స్పందించి శునకానందం పొందాడు. వాన్ విరాట్‌పై చేసిన ట్వీట్ సోషల్‌మీడియాలో వైరలైంది. వాన్‌పై విరాట్ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కొందరు, వాన్‌కు ఇలాంటి చెత్త ప్రవర్తన కొత్తేమీ కాదంటూ లైట్ తీసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విరాట్ మెరుపు హాఫ్ సెంచరీ (81) చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను మరిన్ని ఘనతలు సాధించాడు.
ఈ సీజన్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా అవతరించడమే కాకుండా.. ఐపీఎల్‌లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ తరఫున 400 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. విరాట్‌తో పాటు దేవ్‌దత్ పడిక్కల్ (55) కూడా మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో గుజరాత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ అద్భుత శతకం వృధా అయ్యింది.


