క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ట్రాక్టర్‌తో మైదానంలోకి దూసుకువచ్చాడు.. పిచ్చి పట్టినట్లుగా క్రికెట్ పిచ్ మొత్తాన్ని ట్రాక్టర్‌తో తొక్కించేశాడు.. ఫలితంగా.. ఫలితం తేలకుండానే మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన మహారాష్ట్రలోని జలగావ్‌లో జరిగింది. జలగావ్ రూరల్ ఎంఎల్‌ఏ కప్ టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ యువకుడు ట్రాక్టర్‌పై అకస్మాత్తుగా మైదానంలోకి వచ్చాడు.
నిస్సహాయంగా
ఏం జరుగుతుందో అర్థం కాక ఆటగాళ్లు చెల్లాచెదురై పోయారు. ఇంతలో అతడు వేగంగా పిచ్ మీదకు దూసుకువచ్చి.. ట్రాక్టర్‌తో పిచ్ మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఆటగాళ్లు, అంపైర్లు ఏమీ చేయలేక నిస్సహాయంగా అలా చూస్తుండిపోయారు. దీంతో మైదానంలో గందరగోళం నెలకొంది.
కాగా ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక వ్యక్తి ఒకరిని ఫైనల్ మ్యాచ్‌కు ఆహ్వానించకపోవడంతో సదరు వ్యక్తి ఇలా చేయించినట్లు సమాచారం. అనూహ్య ఘటనతో మ్యాచ్ రద్దైపోగా.. పిచ్‌ను తొక్కించిన వ్యక్తిపై మాత్రం ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఇక ఈ దృశ్యాలు వైరల్ కాగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఎవరిది బాధ్యత
‘‘బహుశా ఆ మైదానం అతడిదే అయి ఉంటుంది. ఓనర్‌నే మ్యాచ్‌కు ఆహ్వానించకపోతే ఎలా? అందుకే ఇలా చేశాడు’’ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదు. ట్రాక్టర్‌తో వేగంగా దూసుకువచ్చిన సమయంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత. ఇలాంటి వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందే’’ అని పేర్కొంటున్నారు.
Tractor Driver plows the cricket pitch mid-final in Jalgaon after the driver wasn’t invited to the tournament 😭 pic.twitter.com/LLS61mkRWJ
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 18, 2026


