స్టార్స్‌ ఆడతారా? | Today Mumbai Indians face Chennai Super Kings | Sakshi
Sakshi News home page

స్టార్స్‌ ఆడతారా?

Apr 23 2026 1:08 AM | Updated on Apr 23 2026 1:08 AM

Today Mumbai Indians face Chennai Super Kings

ధోని, రోహిత్‌ శర్మ సాధన

నేడు ముంబైతో చెన్నై ఢీ 

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం  

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరు మ్యాచ్‌లు ఆడినా మహేంద్ర సింగ్‌ ధోని ఇంకా బరిలోకి దిగలేదు. గాయం నుంచి కోలుకుంటున్న అతను ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్‌ ఆరు మ్యాచ్‌లు ఆడగా... తొలి నాలుగు మ్యాచ్‌లలో బరిలోకి దిగిన రోహిత్‌ శర్మ గాయంతో గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య వాంఖెడే మైదానంలో జరిగే మ్యాచ్‌లో వీరిద్దరు బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ ఇద్దరు భారత స్టార్లు బుధవారం సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అయితే గత మ్యాచ్‌కు ముందు కూడా సాధన చేసినా... చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఈసారి వారి పునరాగమనం మళ్లీ ఆసక్తిగా మారింది.  టోర్నీలో ఇరు జట్లు ప్రస్తుతం చెరో నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ముంబై ఏడో స్థానంలో, చెన్నై ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాయి. 

నాలుగు వరుస పరాజయాల తర్వాత తిలక్‌ వర్మ మెరుపులతో గత మ్యాచ్‌లో నెగ్గిన ముంబై సొంతగడ్డపై అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. డికాక్, నమన్‌ ధీర్‌లతో పాటు సూర్యకుమార్, కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా కూడా రాణిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంది. బౌలింగ్‌లో బుమ్రా ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా, అశ్వని కుమార్‌ కూడా ఆకట్టుకున్నాడు. ఇద్దరు విదేశీ స్పిన్నర్లు సాంట్నర్, ఘజన్‌ఫర్‌ ప్రత్యర్థిని కట్టడి చేయగలరు. 

మరోవైపు వరుసగా రెండు విజయాలతో కోలుకున్నట్లు అనిపించిన చెన్నై గత పోరులో హైదరాబాద్‌ చేతిలో ఓడి మళ్లీ వెనుకబడింది. సంజూ సామ్సన్‌ ఫర్వాలేదనిపిస్తున్నా, కెప్టెన్ రుతురాజ్‌ ఫామ్‌ ఆందోళనకరంగా ఉంది. పైగా సత్తా చాటిన యువ బ్యాటర్‌ ఆయుశ్‌ మాత్రే గాయంతో టోర్నీకి దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. టాపార్డర్‌లో అతని స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement