Sakshi Special Story On Romanian Gymnast Nadia Comaneci - Sakshi
Sakshi News home page

14 ఏళ్ల వయసులోనే సంచలనాలు.. ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా..!

Published Sun, May 14 2023 10:24 AM

Sakshi Special Story On Romanian Gymnast Nadia Comaneci

1976 మాంట్రియల్‌ ఒలింపిక్స్‌.. జిమ్నాస్టిక్స్‌ పోటీలు జరుగుతున్నాయి. అన్‌ ఈవెన్‌ బార్స్‌ విభాగంలో జిమ్నాస్ట్‌లు పోటీ పడుతున్నారు. తీవ్రమైన పోటీ మధ్య ఆటగాళ్లంతా సత్తా చాటారు. పోరు ముగిసింది. అయితే నిర్వాహకుల్లో ఒక రకమైన ఆందోళన.. ఉత్కంఠత.. ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి. అది ఎవరూ ఊహించలేనిది.. అందుకే తగిన ఏర్పాట్లు కూడా చేసుకోలేదు.

అసలేం జరిగిందంటే స్కోరు  చూపించే ఎలక్ట్రానిక్‌ బోర్డుపై గరిష్ఠంగా మూడు అంకెలు మాత్రమే ప్రదర్శించే వీలుంది. కానీ ఆ అమ్మాయి సాధించిన స్కోరు 10 పాయింట్లు! అంటే 10.00గా రావాలి. కానీ అది సాధ్యం కాలేదు. చివరకు ‘1.00’గా మాత్రమే  కనిపించింది. ఒలింపిక్స్‌ చరిత్రలో తొలి సారి ‘పర్‌ఫెక్ట్‌ 10’ స్కోర్‌ చేసి సంచలనం సృష్టించిన ఆ అమ్మాయి పేరే నాదియా కొమనెచ్‌. కేవలం 14 ఏళ్ల వయసులో సాధించిన ఈ ఘనతతో మొదలు పెట్టి ఆల్‌టైమ్‌ జిమ్నాస్టిక్‌ గ్రేట్‌లలో ఒకరిగా  నిలిచింది. 

రొమేనియాకు చెందిన నాదియా ప్రస్థానం ఆసక్తికరం. టీనేజర్‌గా ఒలింపిక్స్‌లో సంచలనాలు నమోదు చేయడం మొదలు సొంత దేశంలోనే పరాయిదానిలా ఆంక్షల మధ్య బతకడం, ఆపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రహస్యంగా మరో దేశానికి వెళ్లిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం, అనంతరం అక్కడే వర్ధమాన జిమ్నాస్ట్‌లను తీర్చిదిద్దడం వరకు ఎన్నో మలుపులు ఉన్నాయి. మాంట్రియల్‌ ఒలింపిక్స్‌లో అన్‌ ఈవెన్‌ బార్స్‌లో ‘పర్‌ఫెక్ట్‌ 10’తోనే ఆమె ఆగిపోలేదు. ఆ మెగా ఈవెంట్లో మరో ఆరు సార్లు ఆమె ‘పర్‌ఫెక్ట్‌ 10’ను సాధించగలిగిందంటే ఆ అద్భుత ప్రతిభ ఏమిటో అర్థమవుతుంది. రొమేనియా దేశం తరఫున ‘ఒలింపిక్‌ ఆల్‌రౌండ్‌’ టైటిల్‌ గెలిచిన తొలి ప్లేయర్‌గా నాదియా నిలిచింది. 

సహజ ప్రతిభతో..
శరీరాన్ని విల్లులా వంచుతూ ఎన్నెన్నో విన్యాసాలతో కనువిందు చేసే జిమ్నాస్టిక్స్‌కు క్రీడా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒలింపిక్‌ క్రీడల్లోనైతే జిమ్నాస్ట్‌ల ప్రదర్శన ప్రతిసారీ విశేషమైన ఆసక్తే. అలాంటి పోటీలకు నాదియా అదనపు ఆకర్షణను తెచ్చింది. అపార ప్రతిభ, బ్యాలెన్సింగ్, క్లీన్‌ టెక్నిక్‌తో ఆమె ఈ పోటీల్లో శిఖరాలను అందుకుంది. ఒక్కసారి బరిలోకి దిగితే కేవలం సాంకేతికాంశాలు, పాయింట్లు మాత్రమే కాదు, నాదియా ఆట కొత్త తరహాలో అందంగా మారిపోయేది. ఆమె చేసిన విన్యాసాలు మరెవరికీ సాధ్యం కాలేదంటే ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. బీమ్‌పై ఏరియల్‌ వాకోవర్‌ చేసిన తొలి జిమ్నాస్ట్‌ నాదియానే! కళ్లు తిప్పుకోలేని ఏరియల్‌ కార్ట్‌వీల్‌ బ్యాక్‌ హ్యాండ్‌స్ప్రింగ్‌ను, డబుల్‌ ట్విస్ట్‌ డిస్‌మౌంట్‌ను, ఫ్లోర్‌పై డబుల్‌ బ్యాక్‌ సాల్టోను ప్రదర్శించిన తొలి జిమ్నాస్ట్‌గా ఘనత వహించింది. 

వరుస విజయాలు సాధించి..
‘చిన్నప్పుడు అత్యంత చురుగ్గా ఉండేది. ఎగరడం, గెంతడం, దూకడం, ఇలా అన్నింటా నేను ఆమెను అదుపు చేయలేకపోయేదాన్ని, అందుకే ఆమెను జిమ్నాస్టిక్స్‌లో చేర్పించాను’ నాదియా గురించి ఆమె తల్లి చెప్పిన మాట అది. అయితే ఆ అల్లరి పిల్ల అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని తల్లి కూడా ఊహించలేకపోయింది. ఆరేళ్ల వయసులో పాఠశాల స్థాయిలో ఆటలో ఓనమాలు నేర్చుకుంది. ఏడేళ్ల వయసులో కోచింగ్‌ అకాడమీలో అత్యుత్తమ ప్రదర్శనతో గుర్తింపు, 9 ఏళ్ల వయసు వచ్చే సరికి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే కాదు రొమేనియా జాతీయ చాంపియన్‌గా నిలిచిన అత్యంత పిన్న వయస్కురాలనే రికార్డ్‌ కూడా నమోదు చేసేసింది.

అదే ఏడాది తొలి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న నాదియా వరుస విజయాలతో సత్తా చాటింది. 13 ఏళ్లకు యూరోపియన్‌ టోర్నీలో అన్ని టైటిల్స్‌ సాధించేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మన్‌ హటన్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ‘అమెరికన్‌  కప్‌’లో సత్తా చాటి పతకాలు సాధించడంతో నాదియా పేరు మార్మోగింది. భవిష్యత్తు తారగా ఆమెను క్రీడా ప్రపంచం గుర్తించింది. నిజంగానే ఆపై ఆమె తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోవడంలో సఫలమైంది. 

ఒలింపిక్స్‌లో జోరు..
మాంట్రియల్‌ ఒలింపిక్స్‌లో మొదటినుంచి నాదియా హవా కొనసాగింది. అన్‌ ఈవెన్‌ బార్స్‌ విభాగంలోనే కాకుండా బ్యాలెన్స్‌ బీమ్, వ్యక్తిగత ఆల్‌రౌండ్‌ ప్రదర్శనల్లో కూడా ఆమె స్వర్ణాలు సొంతం చేసుకుంది. ఇదే ఒలింపిక్స్‌లో టీమ్‌ ఆల్‌రౌండ్‌లో రజతంతో పాటు ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌లో కాంస్యం కూడా గెలుచుకుంది. హార్ట్‌వాల్ట్‌లో మాత్రం త్రుటిలో కాంస్యం చేజారి నాలుగో స్థానం దక్కింది. ఈ విజయాలు, ‘పర్‌ఫెక్ట్‌ 10’ప్రదర్శనతో నాదియా ఒక్కసారిగా స్టార్‌ అయిపోయింది. పలు అవార్డులు, రివార్డులు వచ్చి పడ్డాయి. అప్పటికే పాపులర్‌ అయిన పాట ‘కాటన్‌ డ్రీమ్స్‌’ను ఆమె గౌరవ సూచకంగా ‘నాదియాస్‌ థీమ్‌’ అంటూ పేరు మార్చడం విశేషం.

ఆ తర్వాత నాదియా ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ పోటీల సమయంలో ఇదే పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించడం విశేషం. ఒలింపిక్స్‌ విజయాల తర్వాత కూడా ఆమె జోరు కొనసాగింది. ఈ పోటీలకు, 1980 మాస్కో ఒలింపిక్స్‌కు మధ్య నాదియా ప్రపంచ చాంపియన్‌షిప్‌లు, యూరోపియన్‌  చాంపియన్‌షిప్‌లు, వరల్డ్‌ కప్‌లలో కలిపి 7 స్వర్ణాలు సహా 14 పతకాలు సాధించింది. ఇదే ఉత్సాహంతో ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టిన ఆమె మరో మంచి ప్రదర్శనను నమోదు చేసింది. ఇక్కడా 2 స్వర్ణాలు, 2 రజతాలు సాధించడంలో ఆమె సఫలమైంది. మోత్తంగా నాదియా గెలిచిన 5 ఒలింపిక్స్‌ స్వర్ణాలు కూడా వ్యక్తిగత విభాగంలోనివే కావడం విశేషం. 

దేశం దాటి వెళ్లి..
స్టార్‌గా ఎదిగిన తర్వాత నాదియా.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా క్రీడాభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో ‘నాదియా 81’ పేరుతో ఆమె, ఇతర కోచ్‌లు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో రొమేనియాలో కమ్యూనిస్ట్‌ నికోల్‌ సీషెస్‌ నాయకత్వంలో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోంది. దాంతో వారి దేశంలో పలు ఆంక్షలు, ఆర్థిక సమస్యలు ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టసాగాయి. ఇలాంటి స్థితిలో అమెరికాను చేరిన బృందంలో నాదియా మినహా మిగతావారంతా అక్కడే ఉండిపోయారు. తాను మాత్రం స్వదేశం వెళ్లాలనే నిర్ణయించుకుంది. అది ఎంత పెద్ద తప్పో ఆ తర్వాత ఆమెకు తెలిసొచ్చింది.

ఇతర ఆటగాళ్లు, కోచ్‌లు అమెరికాలోనే ఉండిపోవడంతో నాదియా పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది.  ‘మా దేశపు జాతీయ సంపత్తి’ అంటూ నాదియాపై ప్రభుత్వం దేశం దాటి వెళ్లకుండా పలు ఆంక్షలు విధించడంతో పాటు ఆమె ప్రతికదలికపై నిఘా పెట్టింది. ‘నా కుటుంబం కోసం కొంత అదనంగా సంపాదించే అవకాశాన్ని నాకు దూరం చేయడంతో పాటు నన్ను ఖైదీగా మార్చారు’ అంటూ ఆమె వాపోయింది. ఎట్టకేలకు 1989 నవంబర్‌లో కొందరి సహకారంతో ఒక అర్ధరాత్రి  నడుస్తూనే రొమేనియా సరిహద్దు దాటింది. ఆపై హంగరీ, ఆస్ట్రియా మీదుగా వెళ్లి మొత్తానికి అమెరికా విమానం ఎక్కింది.

అక్కడ ఆమెకు తగిన సహకారం, గౌరవం లభించాయి. తర్వాత కొన్ని వారాలకే రొమేనియా విప్లవంతో అక్కడి ప్రభుత్వం కుప్పకూలి ప్రజాస్వామ్యం రావడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయి. గతంలో తనకు స్నేహితుడిగా ఉన్న అమెరికా జిమ్నాస్ట్, రెండు ఒలింపిక్స్‌ స్వర్ణాల విజేత బార్ట్‌ కానర్‌ను 1996లో వివాహమాడింది. స్వదేశానికి తిరిగొచ్చి రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లోనే ఆమె పెళ్లి చేసుకోవడం విశేషం. రిటైర్మెంట్‌ తర్వాత కూడా వేర్వేరు హోదాల్లో ప్రపంచ జిమ్నాస్టిక్స్‌తో నాదియా అనుబంధం కొనసాగుతోంది.  -మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

Advertisement
Advertisement