ఇంగ్లండ్ స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కీలక ప్లేయర్ జోస్ బట్లర్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ డ్రీమ్ ఎలెవన్‌ను ప్రకటించి అభిమానుల్లో చర్చకు తెరలేపాడు. బట్లర్ టీమిండియా విధ్వంసకర ఆటగాడు, ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు కల్పించకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
బట్లర్ రోహిత్‌ను విస్మరించడాన్ని హిట్‌మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్‌పై శీతకన్ను ప్రదర్శించి, అతని సమవుజ్జీ అయిన విరాట్ కోహ్లిని జట్టులోకి తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు. బట్లర్ ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనిని ఎంపిక చేశాడు.
ఈ జట్టులో బట్లర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లకు పెద్దపీట వేశాడు. ఓపెనర్లుగా విరాట్ కోహ్లి, క్రిస్ గేల్‌లను ఎంపిక చేసి.. మూడో స్థానంలో 'మిస్టర్ ఐపీఎల్'గా పేరొందిన సురేశ్ రైనాకు చోటిచ్చాడు. నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేశాడు.
మిడిలార్డర్‌లో వెస్టిండీస్ దిగ్గజాలు కీరన్ పోలార్డ్, ఆండ్రీ రసెల్\కు స్థానం కల్పించి.. వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనిని ఎంచుకున్నాడు.
ఆల్‌రౌండర్లుగా రషీద్ ఖాన్, సునీల్ నరైన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించాడు. ఈ జట్టులో బట్లర్ తన పేరును కూడా చేర్చకోకపోవడం కొసమెరుపు.
మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ స్టువర్ట్ బ్రాడ్‌తో నిర్వహించిన 'For The Love Of Cricket' పోడ్‌కాస్ట్‌లో బట్లర్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టును వెల్లడించాడు.
బట్లర్ ఎంపిక చేసిన ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టు:
విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్, కీరన్ పోలార్డ్, ఆండ్రే రస్సెల్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రషీద్ ఖాన్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా.


