ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. బుధవారం వాంఖడే మైదానం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘన విజయాన్ని అందుకుంది. ముంబై నిర్ధేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఊదిపడేసింది.
ఈ విజయంలో ట్రావిస్ హెడ్ (76 పరుగులు),అభిషేక్ శర్మ (45 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్ (65 నాటౌట్),సలీల్ అరోరా (10 బంతుల్లో 30 నాటౌట్)లది కీలక పాత్ర. ఓపెనర్లు అభిషేక్, హెడ్‌కు 129 పరుగులు అందించగా.. క్లాసెన్, ఆరోరా దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. హైదరాబాద్‌కు ఐపీఎల్‌లో ఇది వందో విజయం కావడం గమానార్హం. మ్యాచ్ అనంతరం ఈ చారిత్రత్మక విజయంపై ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ స్పందించాడు. ఎంతటి భారీ టార్గెట్‌నైనా ఛేదించే సత్తా తమ బ్యాటర్లకు ఉందని కమ్మిన్స్ అన్నాడు.
"244 పరుగుల లక్ష్యాన్ని చేధించడం అంత సులువు కాదు. కానీ మా బ్యాటింగ్ లైనప్ గురుంచి తెలుసు కాబట్టి ఖచ్చితంగా చేధిస్తామని అనుకున్నాను. మా బాయ్స్ నా నమ్మకాన్ని నిజం చేశారు. మా ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ గురుంచి ఎంత చెప్పిన తక్కువే. వారు ఆడుతున్న తీరు చూస్తుంటే భయం అన్నదే లేనిట్లు అన్పిస్తోంది. ముఖ్యంగా పిచ్ బాగున్నప్పుడు వారు ఆడే షాట్లకు బౌలర్లు బెంబేలెత్తాల్సిందే.
వారికి బౌలింగ్ వేయాల్సిన అవసరం నాకు లేనందుకు సంతోషిస్తున్నాను. ఇక క్లాసెన్ మరోసారి తన క్లాస్ ఎంటో చూపించాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు రాణిస్తున్నాడు. అటువంటి ఆటగాడు జట్టులో ఉన్నందుకు మా అదృష్టం. మరోవైపు యువ ఆటగాడు సలీల్ అరోరా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్‌లో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఛాన్స్ దొరికిన ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తాచాటుతున్నాడు.
కోచింగ్ స్టాఫ్ యువ ఆటగాళ్లలో నింపిన 'ఫియర్ లెస్' వైఖరి జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. ఐదేళ్ల క్రితం ఐపీఎల్‌కి, ఇప్పటి టోర్నీకి చాలా తేడా ఉంది. గతంలో 200 పరుగులు ఛేదించడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఓవర్‌కు 12 పరుగులు చేయాల్సి ఉన్నా, బ్యాటర్లు దానిని సులువుగా ఛేదిస్తున్నారు.
ఇటువంటి హైస్కోరింగ్ మ్యాచ్‌లలో బౌలర్ల పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి మ్యాచ్‌లలో ఒక అద్భుతమైన 'యార్కర్' మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. మా జట్టులో ఈషన్ మలింగ వంటి అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. అతడు మా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.
చదవండి: చాలా బాధగా ఉంది.. వారిని మాత్రం తప్పుబట్టను: హార్దిక్


