ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సీఎస్‌కే 23 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ (115 నాటౌట్) సూపర్ సెంచరీ సాధించి సీఎస్‌కేకు తొలి విజయాన్ని అందించాడు. సంజూ రాజస్థాన్ నుంచి సీఎస్‌కేకు మారిన తర్వాత ఇది తొలి సెంచరీ. ఈ సెంచరీతో అతను చాలా రికార్డులు సాధించాడు.
ఇందులో ముఖ్యమైనది..
సంజూ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు నాలుగు సెంచరీలు (ప్రస్తుత సెంచరీతో కలుపుకొని) చేయగా.. అందులో ప్రతి సెంచరీ సీజన్‌లో మొట్టమొదటిదిగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ ఘనత సాధించలేదు. తాను చేసిన నాలుగు సెంచరీలు సీజన్‌లో మొదటివి కావడం సంజూకు మాత్రమే సాధ్యమైంది.
2017, 2019, 2021, 2026 సీజన్లలో మొదటి సెంచరీలను సంజూనే చేశాడు. తద్వారా సీజన్‌లో తొలి సెంచరీలను ఎక్కువ సార్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించి సంజూ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కల్లమ్ ఉన్నాడు.
మెక్‌కల్లమ్ 2008, 2015 సీజన్లలో తొలి సెంచరీలు చేసి, సీజన్‌లో తొలి సెంచరీలు అత్యధిక సార్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజూ తర్వాతి స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత చాలామంది ఆటగాళ్లు సీజన్‌లో తొలి సెంచరీలు చేశారు.
ప్రతి ఐపీఎల్ సీజన్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాళ్లు..
2008- బ్రెండన్ మెక్‌కల్లమ్
2009- ఏబీ డివిలియర్స్
2010- యూసఫ్ పఠాన్
2011- పాల్ వాల్తాటి
2012- అజింక్య రహానే
2013- షేన్ వాట్సన్
2014- లెండిల్ సిమన్స్
2015- బ్రెండన్ మెక్‌కల్లమ్
2016- క్వింటన్ డికాక్
2017- సంజూ శాంసన్
2018- క్రిస్ గేల్
2019- సంజూ శాంసన్
2020- కేఎల్ రాహుల్
2021- సంజూ శాంసన్
2022- జోస్ బట్లర్
2023- హ్యారీ బ్రూక్
2024- విరాట్ కోహ్లి
2025- ఇషాన్ కిషన్
2026- సంజూ శాంసన్
పై రికార్డు కాకుండా ఈ సెంచరీతో సంజూ మరో భారీ రికార్డు కూడా సాధించాడు. ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్ల తరఫున సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. సంజూ ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్ (2), సీఎస్‌కే ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేశాడు. సంజూకు ముందు కేఎల్ రాహుల్ ఈ ఘనతను సాధించాడు. రాహుల్ పంజాబ్, లక్నో, ఢిల్లీ ఫ్రాంచైజీల తరఫున సెంచరీలు చేశాడు.


