ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 20) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ 99 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. తిలక్ వర్మ (101 నాటౌట్) రికార్డు శతకంతో ముంబై ఇండియన్స్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. నాలుగు వరుస పరాజయాల తర్వాత ముంబైకి వచ్చిన మొదటి గెలుపు ఇది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచి ఉండకపోయుంటే ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా సంక్లిష్టం అయ్యేవి.
మరోవైపు గుజరాత్‌కు ఇది హ్యాట్రిక్ విజయాల తర్వాత తొలి పరాజయం. ఈ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 200 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ చేతులెత్తేసింది. అశ్వనీ కుమార్ (4-0-24-4), ఘజన్‌ఫర్ (2.5-0-17-2), సాంట్నర్ (3-0-16-2) ధాటికి 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓటమిపై సమీక్షిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. మధ్య ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు.
గిల్ మాటల్లో.. ఈ పిచ్‌పై 160-170 పరుగుల స్కోర్ చాలా ఎక్కువ. మా బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోవడం వల్ల ప్రత్యర్థి జట్టు అదనపు పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. వాటిని భవిష్యత్తులో అమలు చేయాల్సిన అవసరం ఉంది.
ఈ ఓటమిని పెద్ద సమస్యగా చూడదలచుకోలేదు. చిన్న అవాంరంగానే పరిగణిస్తాం. ఇకపై బయట మైదానాల్లో జరిగే మ్యాచ్‌ల్లో తిరిగి విజయాల బాట పడతాం. జట్టు ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన మార్పులు చేసుకుంటాము.
పిచ్‌పై మాట్లాడుతూ.. వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. బంతి సరిగా బ్యాట్‌పైకి రాకపోవడం బౌలర్లకు సవాలుగా మారింది. కొన్ని బంతులు వేగంగా, మరికొన్ని నెమ్మదిగా, ఇంకొన్ని తక్కువ ఎత్తులో ఉండటం వల్ల సరైన లెంగ్త్‌ను నిరంతరం కొనసాగించలేకపోయాము. ముఖ్యంగా మధ్య ఓవర్లలో ఒకే లెంగ్త్‌ను కచ్చితంగా పాటించలేకపోవడం మా ప్రధాన లోపం.
ప్రత్యర్థి బ్యాటింగ్ సమయంలో పిచ్‌లో మార్పులపై ప్రశ్నించగా.. పెద్దగా తేడా లేదని చెప్పాడు. అయితే తమ బ్యాటింగ్ సమయానికి కొంత మంచు ప్రభావం ఉండిందని అన్నాడు. ఇది ముంబై బౌలర్లకు కలిసొచ్చిందని పరోక్షంగా తెలిపాడు.
మొత్తంగా, గిల్ ఈ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటే మళ్లీ విజయాల బాట వచ్చని నమ్మకం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా తన జట్టును మళ్లీ సమతుల్యంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు.


