ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సీజన్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఆరో ఓటమిని నమోదు చేసింది. బుధవారం వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది.
243 పరుగుల భారీ టార్గెట్‌ను కూడా ముంబై కాపాడుకోలేక పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు భారీ తప్పిదం చేసింది. బౌలర్లను ఊచకోత కోసిన ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేసే అవకాశాన్ని ముంబై ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోల్పోయింది. ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో రెండో బంతిని బ్యాక్ ఆఫ్‌ది లెంగ్త్ డెలివరీగా బౌల్ట్ సంధించాడు.
ఆ బంతిని హెడ్ లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు సమీపంగా వెళుతూ కీపర్ చేతుల్లో పడింది. దీనిని కీపర్, బౌలర్ ఎవరూ సరిగా గుర్తించకపోవడంతో ముంబై అప్పీల్‌కు కూడా ప్రయత్నించలేదు. తర్వాత రీప్లేలో చూడగా బంతి హెడ్ బ్యాట్‌కు తగిలినట్లుగా స్పష్టమైంది.
ఈ సమయంలో హెడ్ స్కోరు 8 పరుగులు మాత్రమే. ఈ తప్పిదానికి ముంబై భారీ మూల్యం చెల్లించుకోవాల్సింది. ఆ తర్వాత ఈ ఆసీస్ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హెడ్ కేవలం 30 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ముంబై ఓటమిని శాసించాడు. ఒకవేళ 8 పరుగుల వద్ద హెడ్ ఔటై వుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో హెడ్ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను కూడా ముంబై ఫీల్డర్లు జారవిడిచారు.
చదవండి: భయం వారి బ్లడ్‌లోనే లేదు.. తెలిసిందల్లా ఒక్కటే: పాట్ కమ్మిన్స్


