IPL: ప్రిడిక్షన్ పేరిట ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చు.. జాగ్రత్త | CP VC Sajjanar Warns IPL Fans Against Online Betting Scams, Urge Reporting Fake Prediction Ads, Watch Video Inside | Sakshi
Sakshi News home page

IPL: ప్రిడిక్షన్ పేరిట ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చు.. జాగ్రత్త

Apr 7 2026 3:24 PM | Updated on Apr 7 2026 4:05 PM

IPL 2026: CP VC Sajjanar Warns Against Betting Asks Fans To Be Careful

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 ఎడిషన్‌ ఇప్పటికే ఆరంభమైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందిన ఈ టీ20 లీగ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మాయగాళ్లు బెట్టింగ్‌ పేరిట ఉచ్చు బిగుస్తూ ఉంటారు. ఈసారి కూడా ‘ఐపీఎల్ ప్రిడిక్షన్ పేరిట ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చు.. జాగ్రత్త’ అని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ క్రికెట్‌ ప్రేమికులను హెచ్చరించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ వేదికగా.. ‘‘ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌ను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో కొందరు మోసపూరిత ప్రకటనలతో విరుచుకుపడుతున్నారు. కేవలం డబ్బు కోసం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారు.

టాస్ ఎవరిది!? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది!? అని ముందే చెబుతామంటూ మిమ్మల్ని తమ ఛానెల్స్‌లో సబ్‌స్క్రైబ్ చేయించుకుని, నిలువునా ముంచే బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. ఇలాంటి ఫేక్ ప్రిడిక్షన్ ఛానెళ్ల మాటలు నమ్మి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు.

ఇలాంటి ప్రమోషన్ల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోంది. గత నెల రోజుల్లోనే 494 పెయిడ్ ప్రకటనలను, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ప్రొఫైళ్లను బ్లాక్ చేయించాం. ఈ నిఘా నిరంతరం కొనసాగుతుంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.

ఇలాంటి మోసపూరిత యాడ్స్ మీ దృష్టికి వచ్చినా లేదా మీరు మోసపోయినా, వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి’’ అని సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement