ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 26) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో తన జట్టు ఓడినా, సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో 4 సిక్సర్లు బాదిన రుతురాజ్ ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున 100 సిక్సర్ల మార్కును అందుకున్నాడు.
తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రుతురాజ్‌కు ముందు ధోని (234), సురేశ్ రైనా (180), శివమ్ దూబే (106) మాత్రమే ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం రుతురాజ్ ఖాతాలో 101 సిక్సర్లు ఉన్నాయి.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో రుతురాజ్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో గౌరవప్రదమైన స్కోర్ అందించినప్పటికీ.. సీఎస్‌కే పరాజయంపాలైంది. రుతురాజ్ 60 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో రుతురాజ్ మినహా ఎవరూ రాణించలేదు. సంజూ శాంసన్ 11, ఉర్విల్ పటేల్ 4, సర్ఫరాజ్ ఖాన్ డకౌట్, బ్రెవిస్ 2, శివమ్ దూబే 22, కార్తీక్ శర్మ 15, ఓవర్టన్ 18 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 3, అర్షద్ ఖాన్ 2, సిరాజ్, సుతార్ తలో వికెట్ తీశారు.
అనంతరం 159 పరుగుల సాధారణ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఆడుతుపాడుతూ ఛేదించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (87) భారీ అర్ద సెంచరీతో తన జట్టును గెలిపించాడు. అతనికి కెప్టెన్ గిల్ (33), బట్లర్ (39) సహకరించారు. సీఎస్‌కే బౌలర్లలో అకీల్ హొసేన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ తర్వాత గుజరాత్ ఐదో స్థానానికి ఎగబాకగా.. సీఎస్‌కే ఆరో స్థానానికి పడిపోయింది.


