బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం | Bangladesh Cricketers Salaries Changed In Massive Decision By Tamim Iqbal | Sakshi
Sakshi News home page

బీసీబీ నూతన అధ్యక్షుడి సంచలన నిర్ణయం

Apr 9 2026 3:55 PM | Updated on Apr 9 2026 4:56 PM

Bangladesh Cricketers Salaries Changed In Massive Decision By Tamim Iqbal

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్‌ ఇక్బాల్‌ తన మొదటి నిర్ణయంతోనే సంచలనం సృష్టించాడు. తమీమ్‌ తన తొలి సంతకాన్ని క్రికెటర్ల జీతాల పెంపు ఫైల్‌పై చేసి, వారి జీవితాల్లో ఆనందాలు నింపాడు. 

గతంలో ఏ అధ్యక్షుడు క్రికెటర్ల జీతాల గురించి పట్టించుకోలేదన్న వాదన ఉంది. తమీమ్‌ అధ్యక్షుడు కాగానే జీతాలు పెరగడంతో క్రికెటర్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. బాస్‌ అంటే ఇలా ఉండాలంటూ పలువురు క్రికెటర్లు సోషల్‌మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఏప్రిల్‌ 7న బంగ్లాదేశ్‌ ప్రభుత్వం పూర్వ బోర్డును రద్దు చేసి, తమీమ్‌ను 11 మంది సభ్యులతో కూడిన అడ్‌–హాక్‌ కమిటీకి అధ్యక్షుడిగా నియమించింది. 

37 ఏళ్ల వయసులోనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తమీమ్‌.. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించాడు. తమీమ్‌ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరన్న విషయం తెలిసిందే.

మహిళా క్రికెటర్లకు భారీ ఊరట  
తమీమ్‌ మొదటి నిర్ణయం బంగ్లాదేశ్‌ మహిళా క్రికెటర్లకు భారీ ఊరట కలిగించింది. గతంలో కొందరు స్థానిక క్రికెటర్లు కేవలం 1000 టాకాలు (రూ. 749.69) మాత్రమే జీతంగా పొందేవారు. తమీమ్‌ తాజా నిర్ణయంతో ఇప్పుడు వారి జీతాలు టీ20 మ్యాచ్‌కు 10000 టాకాలు, 50 ఓవర్ల మ్యాచ్‌కు 15000 టాకాలు, ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌కు 20000 టాకాలుగా మారాయి. 

టాప్‌ 36 మహిళా క్రికెటర్ల జీతాలు సైతం గణనీయంగా పెరిగాయి. గతంలో 30000 టాకాలుగా ఉండిన వారి నెల జీతం ఇప్పుడు 40000 టాకాలకు పెరిగింది. ఈ పెంపు మహిళా క్రికెటర్లకు ఆర్థిక భరోసా కలిగించడంతో పాటు ప్రోత్సాహం కూడా అందించింది.  

పురుష క్రికెటర్లకు జాక్‌పాట్‌
తమీమ్‌ నిర్ణయంతో బంగ్లాదేశ్‌ పురుషు క్రికెటర్లకు జాక్‌పాట్‌ తగిలనట్లైంది. గతంలో గ్రేడ్‌ ఏ, బీ, సీ కేటగిరిల్లో ఉండే ఆటగాళ్లకు కేవలం 35000 టాకాలు జీతంగా అందేది. ఇప్పుడు గ్రేడ్‌ల వారీగా విభజన జరిగి, గ్రేడ్‌ సి ఆటగాళ్లకు 40000 టాకాలు, గ్రేడ్‌ బి ఆటగాళ్లకు 50000 టాకాలు, గ్రేడ్‌ ఏ ఆటగాళ్లకు 65000 టాకాలు జీతంగా నిర్ణయించబడింది. 

అలాగే ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఫీజు 75000 టాకాల నుంచి 100000 టాకాలకు పెరిగింది. కొత్త జీతాలు ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని తమీమ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఇన్నేళ్లుగా జీతాల్లో పెద్ద మార్పులు జరగలేదు. కష్టపడి ఆడే ఆటగాళ్లకు న్యాయమైన వేతనం ఇవ్వడం మా లక్ష్యమని అన్నారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement