వర్మ వర్సెస్‌ జనసేన.. పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత | Pitapuram TDP Varma Vs Jana Sena Pendem Dorababu | Sakshi
Sakshi News home page

వర్మ వర్సెస్‌ జనసేన.. పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత

Apr 21 2026 12:25 PM | Updated on Apr 21 2026 1:15 PM

Pitapuram TDP Varma Vs Jana Sena Pendem Dorababu

సాక్షి, కాకినాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మరోసారి జనసేన, టీడీపీల మధ్య చిచ్చు రాజుకుంది. ఫ్లెక్సీ గొడవతో ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. ఈ క్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచా‍ర్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మని జనసేన నేత పెండెం దొరబాబు దాదాపు కొట్టినంత పని చేశారు.  

పిఠాపురంలో మంగళవారం అధికార పార్టీల మధ్య ఘర్షణ జరిగి రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసింది. ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫొటో లేదు. పవన్‌ కల్యాణ్‌ ఫొటో మాత్రం హైలైట్‌ అయ్యింది. ఇది గమనించిన మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఫొటో ఎందుకు పెట్టలేని అక్కడున్న నేతల్ని నిలదీశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జనసేన నేత తుమ్మలబాబు దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఇరు నేతల మధ్య మాటామాటా పెరిగింది. 

ఈలోపు.. అక్కడే ఉన్న పెండెం దొరబాబు వర్మతో వాగ్వాదానికి దిగారు. వర్మపైకి దూసుకొస్తూ దాడి చేసే ప్రయత్నం చేయబోయారు. అది గమనించిన తోటి నేతలు ఆయన్ని నిలవరించారు. ఈలోపు టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం నెట్టేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పిఠాపురంలో వర్మని కొట్టడానికి దూసుకెళ్లిన జనసేన నేతలు

దొరబాబు ఎవడు..మట్టి వ్యాపారం చేసుకునేవాడు, చెరువులు తవ్వడానికి వచ్చాడు. టీడీపీ ఎవరిపైనే అయితే పోరాటం చేసిందో వాడే వచ్చి పెత్తనం చేస్తున్నాడు. చంద్రబాబు ఆదేశాలతో ప్రశాంతంగా ఉంటున్నాం. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం పొటో ఉండి తీరాలి. గెలిపించిన టీడీపీ మీదే పడి కొడతారా?.. అంటూ వర్మ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటు కోనసీమలోనూ.. ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. డ్వాక్రా మహిళలకు సెల్‌పోన్‌ పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫొటో ఏర్పాటు చేయలేదు. దీంతో జనసేన నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. టీడీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగాయి. 

Advertisement
 
Advertisement
Advertisement