బీజేపీ ఎమ్మెల్యే అనుపమకు అఖిలేష్‌ పరామర్శ | Akhilesh Yadav Surprise Visits Injured BJP MLA Anupama Jaiswal In Hospital After Effigy Burning Accident In Bahraich, Watch Video Inside | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యే అనుపమకు అఖిలేష్‌ పరామర్శ

Apr 29 2026 9:36 AM | Updated on Apr 29 2026 10:11 AM

Akhilesh Surprise visits BJP MLA injured while burning his effigy

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, లోక్‌సభ ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌ రాజకీయ ప్రత్యర్థులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనుపమ జైస్వాల్‌ను పరామర్శించారు. అఖిలేష్‌ దిష్టిబొమ్మను తగలబెడుతున్న సమయంలోనే ఆమె గాయపడడం గమనార్హం.

మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో సమాజ్‌వాదీ పార్టీ తీరును నిరసిస్తూ శనివారం బహ్రైచ్‌లో బీజేపీ ‘మహిళా జనాక్రోశ్ మార్చ్’ నిర్వహించింది. అఖిలేష్‌ యాదవ్‌ దిష్టిబొమ్మను దహనం చేసే సమయంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుపమ ముఖం మీద మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆమెను హుటాహుటినా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముఖంపై 75 శాతం కాలిన గాయాలు కావడంతో వైద్యుల సూచన మేరకు మెటాండా ఆస్పత్రికి తరలించారు.  

మంగళవారం ఆస్పత్రికి వెళ్లిన అఖిలేష్ ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. అనుపమ భర్త, కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. ఆయన రాకతో ఆస్పత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వైద్యులు అంతా కలిసి ఆయనతో పొటోలు దిగారు. 

అనంతరం ఆయన సోషల్ మీడియా వేదిక Xలో “సమాజంలో విభేదాల మంటలు కాకుండా.. సఖ్యత, శ్రేయస్సు ఉండాలి. రాజకీయాలకు ఒక స్థానం ఉంది. కానీ మానవ సంబంధాలు కూడా అంతే ముఖ్యమైనవి” అని పోస్ట్‌ చేశారు. జైస్వాల్ భర్త అశోక్ జైస్వాల్ ఈ పరామర్శను ప్రజాస్వామ్య మర్యాదగా అభివర్ణించారు. 

అంతకు ముందు.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌధరి, అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, లక్నో మేయర్ సుష్మ ఖర్క్వాల్ తదితరులు కూడా అనుపమను పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement