● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
● వైద్య రంగంలో రక్తదాతల పాత్ర కీలకం
విజయనగరం ఫోర్ట్: సమాజంలో వైద్యులకు ఎంత ప్రాధాన్యత ఉందో రక్తం దానం చేసే రక్తదాతలకు అంతటి ప్రాధాన్యత ఉంది. ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగికి వైద్యుడు చికిత్స అందించి ప్రాణాలు పోస్తే, రక్తదాతలు రక్తం దానం చేసి ప్రాణాలు నిలుపుతారు. రక్తం అవసరమైన రోగికి సకాలంలో రక్తం ఎక్కించకపోతే మరణించే ప్రమాదం ఉంది. ఆపదలో ఉన్న సాటి మనిషి ప్రాణాలు నిలబెట్టాలన్న గొప్ప మనసు ఉన్న వ్యక్తే రక్తదాత. ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్బంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కధనం. చాలా మంది తమ కుటుంబ సభ్యులు ఆపదలో ఉన్నా సరే రక్తదానం చేయడం ముందుకు రారు. రక్తదానం చేస్తే అనారోగ్యం వచ్చేస్తుందనే భ్రమ ఇప్పటకీ చాలా మందిలో ఉంది. కానీ ఇది అవాస్తవం. రక్తదాతల మానవత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
రక్తదాతలు లేని సమాజం ఊహించలేం
రక్తాన్ని మిగతా వస్తువులు మాదిరి పరిశ్రమల్లో తయారు చేయలేం. రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేం. రక్తదాతలు రక్తం దానం చేయడం ద్వారా మాత్రమే సమాజంలో ఆపదలో ఉన్న రోగులు బ్రతికి బట్టగట్టగలుగుతున్నారు. రక్తదాన శిబిరాల్లో రక్తదాతలు దానం చేసిన రక్తాన్ని బ్లడ్ బ్యాంక్‌ల్లో భద్రపరిచి రక్తం అవసరమైన రోగులకు అందిస్తున్నారు.
ఏటా 25 వేల మంది రక్తదానం
జిల్లాలో ఏటా వేలాది మంది రక్తదానం చేస్తున్నారు. జిల్లాలో ఉన్న బ్లడ్‌బ్యాంక్‌లు, స్వచ్ఛంద రక్తదాన శిబిరాల్లో ఏటా 22 వేలు నుంచి 25 వేలు మంది వరకు రక్తదానం చేస్తున్నారు. దీనిని బట్టి రక్తదాతలు అవసరం ఎంతో ఉందో అర్ధం అవుతుంది. జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం, రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం, నెల్లిమర్ల మిమ్స్ రక్తనిధి కేంద్రం, ఎన్‌వీఎన్ బ్లడ్ బ్యాంక్, రోటరీ బ్లడ్ బ్యాంక్, విజయ బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ బ్యాంక్, బొబ్బిలి బ్లడ్ బ్యాంక్, జీఎంఆర్ బ్లడ్ బ్యాంక్‌లు ఉన్నారు. వీరు రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తం సేకరిస్తూ ఉంటారు.
అరుదైన బ్లడ్ గ్రూపు రక్తదాతలు
రక్తదాతల్లో అరుదైన గ్రూపు ఉన్న రక్తదాతల పాత్ర అత్యంత కీలకం. ఏ పాజిటివ్, బీ పాజిటివ్, ఓ పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కువ మందిలో ఉంటుంది. ఈ గ్రూపు రక్తం సులభంగా లభిస్తుంది. ఏ నెగిటివ్, బీనెగిటివ్, ఏబీ పాజిటివ్, ఏబీ నెగిటివ్ గ్రూపు రక్తం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇటువంటి అరుదైన గ్రూపు రక్తం వివరాలు బ్లడ్ బ్యాంక్‌ల వద్ద ఉన్నాయి. అవసరమైనప్పుడు వీరు ఆ రక్తదాతలకు ఫోన్ చేస్తే వచ్చి రక్తం దానం చేస్తున్నారు.


