కళ్లేదుటే.. కన్నబిడ్డ దుర్మరణం
● మోటార్ సైకిల్‌ను ఢీకొన్న కారు
● మృతి చెందిన ఓ వ్యక్తి
గజపతినగరం రూరల్ : కన్నబిడ్డను చూసేందుకని వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఇటీవలె తండ్రి కావడంతో బిడ్డను చూసొద్దామని వెళ్తే విధికి కన్నెర్ర చేసింది. బిడ్డను చూడకుండానే అనంతలోకాలకు తీసుకుపోయింది. దీంతో ఆ ఇంట రోదనలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మరుపల్లి సమీపాన గల ఓలౌ కంపెనీ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు కథనం ప్రకారం... రామభద్రపురం గ్రామానికి చెందిన చొక్కాపు శేఖర్‌రావు (29) మండలంలోని గుడివాడ గ్రామం నుంచి మోటార్‌సైకిల్‌పై గజపతినగరం వైపు వస్తుండగా... విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న కారు స్థానిక ఓలౌ కంపెనీ వద్ద బలంగా ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన శేఖర్‌రావును గజపతినగరం ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఇటీవలే తండ్రి అయిన శేఖర్ తన కుమారుడిని చూసేందుకు మెంటాడ మండలం గుర్ల తమ్మిరాజుపేట గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శేఖర్‌కు భార్య ధనలక్ష్మి ఉన్నారు. తల్లి చొక్కాపు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెరకముడిదాం: కన్నబిడ్డ కళ్లేదుటే మృతి చెందిన ఘటన ఓ తండ్రికి విషాదం మిగిల్చింది. మండలంలోని పులిగుమ్మి గ్రామంలో ట్రాక్టర్ బోల్తాపడి బాలుడి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని పులిగుమ్మి గ్రామంలో శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన బెజవాడ కృష్ణ తన మామిడితోట దున్నడానికి తన కుమారుడు బెజవాడ జశ్వంత్(13)తో కలిసి వెళ్లాడు. తోట దున్నిన తరువాత వెళ్లిపోయేందుకు ట్రాక్టర్ డ్రైవర్ చిన్నంనాయుడు గట్టుఎక్కించే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పడంతో బోల్తా పడింది. అదే సమయంలో అదే గట్టుపై కృష్ణ కుమారుడు జశ్వంత్ వుండడంతో ట్రాక్టర్ జశ్వంత్‌పై పడిపోయింది. దీంతో జశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. కన్నబిడ్డ కళ్లేదుటే మృతి చెందడంతో తండ్రి గొల్లుమన్నాడు. జశ్వంత్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న బుదరాయవలస ఎస్‌ఐ జె.లోకేష్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బంధువుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేశారు.
ప్రమాదవశాత్తు విద్యార్థి మృతి
బొబ్బిలి రూరల్: మండలంలోని అలజంగి గ్రా మంలో చోటుచేసుకున్న ప్రమాదంలో మున్సిపాలిటీలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన రాంబా ర్కి పవన్‌కుమార్ (13) అనే విద్యార్థి మృతి చెందాడు. ఇటీవల వేసవి సెలవులు కాగా తాతగారి గ్రామమైన అలజంగి వెళ్లగా శ శనివారం గ్రామంలోని శివాలయం వద్ద స్నేహితులతో ఆడుతుండగా అక్కడే ఉన్న కూర్చునే పలకపై కూర్చున్నాడు. ఇంతలో పలక పగిలిపోయి విద్యార్థి గుండెల మీద పడింది. దీంతో స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థి తల్లిదండ్రులు సావిత్రమ్మ, శంకర్రావులు బోరున విలపిస్తున్నారు. సోమవారం నుంచి పాఠశాలకు వెళతానని ఈ రెండు రోజులు తాతగారి ఇంటి విద్దనే ఉంటానని చెప్పి మృత్యువాత పడ్డాడని గొల్లుమంటున్నారు. విద్యార్ధి పవన్ గొల్లపల్లి హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. దీనిపై సీఐ నారాయణరావు వద్ద ప్రస్తావించగా తమకెలాంటి సమాచారం లేదని, ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా పడి బాలుడి మృతి


