వ్యక్తిగత విమర్శలు చేసిన వారిని విడిచిపెట్టేది లేదు.. | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత విమర్శలు చేసిన వారిని విడిచిపెట్టేది లేదు..

Jun 14 2026 10:37 AM | Updated on Jun 14 2026 10:37 AM

వ్యక్తిగత విమర్శలు చేసిన వారిని విడిచిపెట్టేది లేదు..

● మాజీ ఉప ముఖ్యమంత్రిపీడిక రాజన్నదొర

సాలూరు: తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన, చేయించిన వారిని విడిచిపెట్టేది లేదని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర హెచ్చరించారు. పట్టణంలోని తన గృహంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి సంధ్యారాణి తన స్థాయిని మరచి మా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అత్యంత హేయమైన రీతిలో విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాజాగా ఆమె కొందరు గిరిజనులతో తనపై కూడా వ్యక్తిగత విమర్శలు చేయిచారని పేర్కొన్నారు. తానెప్పుడు చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కళ్యాణ్‌పై రాజకీయ విమర్శలే చేశాను తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. తన భార్య లేదా పిల్లలు ఏనాడూ ఏ అధికారికి ఫోన్లు చేయలేదన్నారు. ప్రస్తుత మంత్రి సంధ్యారాణి ఇంట్లో మంత్రి కాకుండా వారి కుటుంబీకులు అధికారులతో ఏమేమి మాట్లాడుతున్నారో అందరికీ తెలుసునన్నారు. మంత్రి సంధ్యారాణి, ఆ పార్టీ నేతలు ఇకనైనా వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని లేకుంటే తాము అటువంటి విమర్శలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలు ప్రజలకు తెలుసునని చెప్పారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పుడు పనులను ప్రజా క్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. నియోజకవర్గంలో నాసిరకంగా పనులు చేపట్టి బిల్లులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కలెక్టర్‌ను అనేక రకాలుగా టీడీపీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. నాసిరకం పనులపై కలెక్టర్‌ స్పందించి విచారణ చేయించి పీఆర్‌, ఐటీడీఏ ఇంజినీరింగ్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే నాసిరకం పనులపై ఆధారాలతో కేంద్ర విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement