రాజాం సిటీ: ఏం కష్టం వచ్చిందో ఏమో మండల పరిధి గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన కోడూరు రాము (35) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజయ్యపేట సమీపంలోని తోటపల్లి కాలువ గట్టు పక్కన చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. అందరితో కలసిమెలసి సరదాగా ఉండే రాము ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడేశారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతునికి భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి ర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


