కోణార్క్‌లో సూర్య ప్రణామ్‌ | - | Sakshi
Sakshi News home page

కోణార్క్‌లో సూర్య ప్రణామ్‌

Jun 15 2026 4:28 AM | Updated on Jun 15 2026 4:28 AM

భువనేశ్వర్‌: అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు ముందు, పవిత్ర సూర్య క్షేత్రం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రఖ్యాత కోణార్క్‌ సూర్య దేవాలయం ప్రాంగణం యోగా సాధకుల సూర్య ప్రణామ్‌తో సరికొత్తగా కనిపించింది. విశాఖపట్నం ఓం ఫ్రీ యోగ సంస్థ నిర్వహించిన 108 ఆవృతుల సామూహిక సూర్య నమస్కారాల యోగా ప్రదర్శనకు రాష్ట్ర గవర్నర్‌ డాక్టరు హరిబాబు కంభంపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం భారత దేశపు ప్రాచీన యోగ సంప్రదాయంలో నిక్షిప్తమై ఉన్న ఆరోగ్యం, క్రమశిక్షణ, సామరస్యం వంటి శాశ్వత విలువలను పునరుద్ఘాటించిందని గవర్నర్‌ హర్షం వ్యక్తం చేశారు. సంపూర్ణ శ్రేయస్సుకు యోగా కాలాతీత ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం చాటి చెప్పిందన్నారు. సూర్య నమస్కారాలు సరికొత్త శక్తిని ప్రసాదిస్తాయి. ప్రకృతి సహజమైన సూర్య కాంతి సమగ్ర జీవ రాశికి ఆరోగ్యదాయకం కావడంతో వర్ధమాన సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రధానంగా ఇంధన, విద్యుత్‌ అవసరాలకు ఉత్తమ ప్రత్యామ్నాయ వనరుగా అక్కరకు వస్తుందని గవర్నర్‌ వివరించారు. ఈ నేపథ్యంలో సౌర శక్తి సద్వినియోగం ప్రథమ కర్తవ్యంగా పౌరులు గుర్తించాలని ఆయన సూచించారు.

పవిత్ర కోణార్క్‌ సూర్యదేవాలయ ప్రాంగణంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహణ తమ పూర్వజన్మ సుకృతమని యోగా గురువు డాక్టర్‌ చిలుక వెంకట రమేష్‌ అన్నారు. యోగా ఆరోగ్య భాగ్యం ప్రచారంతో ఉచితంగా నిర్వహిస్తున్న యోగా సేవలు సర్వత్రా విశేష ఆదరణ నోచుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సామూహిక సూర్య నమస్కారాలు కార్యక్రమం నిర్వహించిన ఓం ఫ్రీ యోగ సంస్థ త్వరలో ప్రముఖ వరాహ నృసింహ స్వామి క్షేత్రం సింహాచలం, అన్నవరంలో సూర్య ప్రణామ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఓం ఫ్రీ యోగ సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురువు డాక్టర్‌ చిలుక వెంకట రమేష్‌, సంస్థ ప్రతినిధులు శాంతారామ్‌, మధుసూదన్‌ రావు, ధర్మరాజు, జిల్లా యోగా సంస్థల ప్రతినిధి యోగ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement