రక్తదానంపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

రక్తదానంపై అవగాహన

Jun 15 2026 4:28 AM | Updated on Jun 15 2026 4:28 AM

జయపురం: ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా జయపురం సైకిల్‌ క్లబ్బు సభ్యులు ఆదివారం అవగాహన ర్యాలీ చేపట్టారు. క్లబ్బు అధ్యక్షులు కిల్లంశెట్టి మోహనరావు నేతృత్వంలో సభ్యులు ’డొనేట్‌ బ్లడ్‌ సేవ్‌ లైఫ్‌’అని నినాదాలు చేస్తూ పట్టణ వీధుల్లో ర్యాలీ చేస్తూ ప్రజలను చైతన్యపరచారు. రక్తదానం చేయటం మానవత్వంమే కాకుండా సామాజిక బాధ్యత అన్నారు. రక్తదానం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతోందన్నారు. కార్యక్రమంలో భాగంగా వారు గొడొపోదర్‌ గ్రామంలో పర్యటించి రక్తదానం ప్రాధాన్యతను స్థానికులకు వివరించారు. తామంతా రక్తదానం చేసేందుకు సిద్ధమని గ్రామస్తులు అన్నారు. రక్తదాన శిబిరాన్ని తమ గ్రామంలో నిర్వహించాలని కోరారు. దీంతో త్వరలోనే రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు క్లబ్బు సభ్యులు వెల్లడించారు. కార్యక్రమంలో కె.మోహనరావు, ప్రతాప్‌ కుమార్‌ పట్నాయక్‌, సదాశివ పట్నాయక్‌, సంజయ నాయిక్‌, అరుణ బిశాయి, కావ్యాంజళి, ఆయుష్‌ పట్నాయక్‌, శివ, సూర్య సాహు ఉన్నారు.

ఏడు ఇళ్లు దగ్ధం

భువనేశ్వర్‌: పూరీ జిల్లా బ్రహ్మగిరి మండలం బెర్హంపూర్‌ గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో ఏడు ఇళ్లు కాలి బూడిదయ్యాయి. దీంతో ఐదు కుటుంబాలు నిలువ నీడ కోల్పోయాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యుట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

రాయగడలో భారీ వర్షం

నేలకూలిన వృక్షాలు

విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు

రాయగడ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం రాయగడలో భారీ గాలులతోపాటు కుంభవృష్టిగా కురిసిన వర్షంతో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. అలాగే రాయగడకు సమీపంలోని తడమ నుంచి చింతాలిగుడ, పెరిగాంకు వెళ్లే రహదారికి పక్కనున్న భారీ వృక్షం కూలిపోయింది. దీంతో మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు గంటన్నరపాటు కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగి రోడ్లపైకి పారడంతో అందులోని చెత్తాచెదారాలు చేరి స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఇదిలాఉండగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి పోవడంతో విద్యుత్‌ సరఫరా గంటసేపు నిలిచిపోయింది. అనంతరం సిబ్బంది యుద్ధ ప్రాదిపదికన మరమ్మతులు చేపట్టడంతో విద్యుత్‌ సరఫరా యథాతధంగా కొనసాగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement