పాతబడి న అడుగులు | - | Sakshi
Sakshi News home page

పాతబడి న అడుగులు

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

సమస్యల మధ్య జిల్లాలో పాఠశాలల పునఃప్రారంభం పాఠ్యపుస్తకాలు మినహా విద్యార్థులకు మరేమీ ఇవ్వని సర్కారు విద్యాకానుక కిట్లకు మంగళం

విద్యార్థులకు సమస్యల స్వాగతం

చిరిగిన బ్యాగ్‌లు, తెగిన చెప్పులు, రంగు వెలిసిపోయిన యూనిఫామ్‌తో విద్యార్థులు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో వేసవి సెలవుల తరువాత బడి గంటలు శుక్రవారం మోగాయి. పాఠశాలలకు చిరిగిన బ్యాగులు తగిలించుకుని, షూస్‌ లేకుండానే చిన్నారులు చిటిపొట్టి అడుగులతో వడివడిగా బడిబాట పట్టారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ తరగతులు పునఃప్రారంభమయ్యాయి. కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే విద్యార్థులకు అందించారు.

తొలి రోజు సంప్రదాయానికి స్వస్తి..

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్‌, యూనిఫామ్‌, షూస్‌, సాక్స్‌, డిక్షనరీ, వర్క్‌బుక్‌ ఇలా అన్ని వస్తువులతో కూడిన కిట్‌ను తొలిరోజే అందించేవారు. ఈ సంప్రదాయాన్ని తొలిసారిగా జగన్‌ ప్రభుత్వం ప్రారంభించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంప్రదాయానికి స్వస్తి పలికిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గత ఏడాది తొలి రోజు అరకొరగానే పుస్తకాలు అందిస్తే ఈ ఏడాది కేవలం పాఠ్యపుస్తకాలతోనే తొలిరోజు పంపిణీని మమ అనిపించారని ఉపాధ్యాయులు వ్మాఖ్యానిస్తున్నారు. అది సైతం కేవలం కొన్ని పాఠశాలల్లోనే జరిగింది. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పాఠశాలకు చేరుకున్న పుస్తకాలను మాత్రమే విద్యార్థులకు అందించామని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.

చిరిగిన బ్యాగ్‌లతో అవస్థలు

చిన్నారులు తొలి రోజు చిరిగిన బ్యాగ్‌లతోనే పాఠశాలలకు హాజరయ్యారు. గత ఏడాది నాణ్యత లేని బ్యాగ్‌లు సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఆ బ్యాగ్‌లు అప్పుడే చిరిగిపోవటంతో వాటిని కుట్టుకొని వినియోగించారు.

తొలి రోజు పాఠశాలలో బ్యాగ్‌ అందిస్తారని ఆశగా వచ్చిన చిన్నారులకు వాటిని సరఫరా చేయకపోవటంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దానికి తోడు పేదలైన చిన్నారులు చాలా మంది తెగిన చెప్పులతో వచ్చారు. కొన్ని పాఠశాలలు పాఠ్యపుస్తకాలు అందించటంతో వాటిని తీసుకెళ్లటానికి విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారు.

సెలవుల అనంతరం పాఠశాలలకు చేరుకున్న విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. చాలా పాఠశాలల్లో తరగతుల కొరత వెంటాడుతోంది. గదులు సరిపోక రెండు తరగతులు ఒకే గదిలో నడిపే పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. అంతేకాకుండా సరిపడ మరుగుదొడ్లు, మంచినీరు, బెంచ్‌లు ఇలా సగానికి పైగా సర్కార్‌ పాఠశాలల్లో సమస్యలు ఉన్నట్లు అధికారుల పర్యవేక్షణలోనే తేలింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement