భవానీపురం(విజయవాడపశ్చిమ): బాల కార్మిక వ్యవస్థ కారణంగా పుస్తకాలు పట్టాల్సిన చేతులతో పనిముట్లను పట్టుకుని పనిచేయడం ద్వారా వారి భవిష్యత్ చిన్నాభిన్నమవుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం భవానీపురంలోని హరిత బెరంపార్క్‌లోని పున్నమీఘాట్‌లో ఏర్పాటు చేసిన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అవగాహన పోస్టర్లను ఆయన విడుదల చేశారు. అనంతరం జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ జి. ధనలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కో ఆర్డినేటర్ అరవ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కుటుంబ సమేతంగా, సీపీ రాజశేఖరబాబు దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. కలెక్టర్ లక్ష్మీశకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన దర్బారు సేవ, పల్లకీ సేవలో చైర్మన్ రాధాకృష్ణతో కలిసి పాల్గొన్నారు. అలాగే సీపీ రాజశేఖరబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. సీపీకి ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): మనసుకు ప్రశాంతత, జీవితానికి సమతుల్యత యోగాతోనే సాధ్యమవుతుందని, అది కేవలం వ్యాయమం కాదని, సంపూర్ణ జీవన విధానానికి మార్గమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భవానీపురంలోని బెరంపార్క్‌లో నిర్వహించిన యోగ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ శ్వాసను నియంత్రించే యోగా మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా జీవితాన్ని క్రమశిక్షణతో నడిపించే శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా ఎంతో అవసరమని చెప్పారు. యోగ సాధనతో ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాకు సమయాన్ని కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయుష్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియదర్శిని, నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ షమ్మి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శ్రీనివాసరావు, సెయింట్ ఆన్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


