ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మామిడిపాలెం రోడ్డుకు చెందిన బబ్బూరి సుబ్బారావు కుటుంబం శుక్రవారం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసి రూ. 9లక్షల విరాళాన్ని అందజేసింది. అలాగే విజయవాడ బందరురోడ్డుకు చెందిన సాదు వెంకట సుబ్బారావు గుప్తా దంపతులు రూ. 1,11,111, పాయకాపురానికి చెందిన ఎం. శ్రీనివాసరావు రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.


