వైఎస్సార్ సీపీ నేత పోతిన మహేష్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దేవదాయ శాఖ ఆస్తులను కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటుగా బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌లకు భగవంతుడు అంటే భయం లేకుండాపోయిందన్నారు. అందువలనే హిందూ దేవాలయాలకు చెందిన 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి, రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత భూముల జాబితా 22 (1) నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తుల పేర్లపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూములను అమ్మకం చేసి వేలకోట్ల రూపాయలు సంపాదించాలని దాని కోసమే దేవదాయ శాఖ ఆస్తుల జాబితా నుంచి తొలగించే బాధ్యతను ఆ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్‌కు అప్పగించారని ఆయన ఆరోపించారు. దేవాలయాల భూముల్ని కొట్టేయాలని చూస్తున్న వారు భగవంతుడి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఒక్క సంతకంతో దేవుడు ఆస్తుల జాబితా నుంచి భూములను తొలగించే నిర్ణయం సాధారణ నిర్ణయం కాదన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్‌గా అభివర్ణించారు. హిందూ ధర్మానికి హిందూ దేవాలయాల భూములకు శాశ్వత నష్టం కలిగించే ఈ మెమోని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మానికి, ఆలయాలకు ఇంత ప్రమాదం జరుగుతుంటే స్వామీజీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయవాడకు వెళ్తుండగా జాతీయ రహదారిపై గొల్లపూడి వద్ద డ్రైవర్ పక్కన ఉండే బానెట్‌లో నుంచి పొగలు వచ్చాయి. ఆ వెంటనే మంటలు వచ్చాయి. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులున్నారు. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దింపేశారు. భయపడిపోయిన కొంత మంది యువకులు ఎమర్జెన్సీ ద్వారం, కిటికీల నుంచి బయటపడ్డారు. బానెట్ కింద ఉండే ఇంజిన్ వద్ద ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ అవడంతో పొగలు ఆ తరువాత మంటలు వచ్చి ఉంటాయని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఎండల తీవ్రత వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.


