కంచికచర్ల: నిత్యావసర సరుకుల కోసం దుకాణానికి వెళ్లిన యువకుడు ట్రాక్టర్ ఢీకొని దుర్మరణం చెందాడు. ఇదే ప్రమాదంలో మరొకరు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన కంచికచర్లలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ పి.విశ్వనాధ్ శనివారం తెలిపిన కథనం మేరకు... మండలంలోని పరిటాల గ్రామానికి చెందిన షేక్ మహ్మద్ రఫీ(28) ఓ ఐరన్ షీట్లు తయారు చేసే ప్యాబ్రిక్స్‌లో పని చేస్తుంటాడు. శుక్రవారం రాత్రి పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన అతడికి కుటుంబసభ్యులు నిత్యావసర సరుకులు తీసుకురావాలని చెప్పగా తన స్నేహితుడు షేక్ షరీప్‌బుడే కలసి స్కూటీపై దుకాణానికి కంచికచర్ల వెళ్లాడు. సరుకులు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా విజయవాడ వైపు నుంచి కంచికచర్ల వైపునకు కంకరలోడుతో వస్తున్న ట్రాక్టర్ వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహ్మద్‌రఫీ తలకు తీవ్ర గాయాలు కాగా షరీప్‌కు కూడా తీవ్ర గాయమయింది. రఫీని వైద్య చికిత్సకోసం ప్రవేటు వాహనం ద్వారా విజయవాడలోని గొల్లపూడి ప్రవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. షరీప్ బుడేను వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు సంతానం ఉన్నారు. రఫీ భార్య కౌసర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
Jun 7 2026 9:18 AM | Updated on Jun 7 2026 9:18 AM
అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు గన్నవరం: మండలంలోని సూరంపల్లిలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కరెంట్ స్తంభంతో పాటు ఓ ఇంటి ప్రహరీని ఢీకొట్టిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గన్నవరం ఆర్టీసీ డిపోకు చెందిన 212పీ సిటీబస్సు కాళేశ్వరరావు మార్కెట్ నుంచి నున్న మీదుగా గన్నవరం బయలుదేరింది. మార్గంమధ్యలో సూరంపల్లిలోని యాదవులపేట వద్దకు రాగనే బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని కొట్టుకుని ఫణికుమార్‌శర్మ ఇంటి ప్రహారీని ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో ప్రహరీ పాక్షికంగా ధ్వంసం కాగా బస్సు ముందు భాగం దెబ్బతింది. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ప్రజలు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే బస్సు స్టీరింగ్ పట్టివేసిన కారణంగా అదుపు తప్పినట్టు బస్సు డ్రైవర్ పేర్కొన్నారు.
నిత్యావసర సరుకులు కోసం వెళ్లి అనంత లోకాలకు..
Advertisement


