బెజవాడలో చీకటి సామ్రాజ్యం! | - | Sakshi
Sakshi News home page

బెజవాడలో చీకటి సామ్రాజ్యం!

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

నయవంచనపై బిగిసిన పిడికిళ్లు బెజవాడలో చీకటి సామ్రాజ్యం!

సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎంపీపై మాజీ ఎంపీ కేశినేని నాని ఫైర్‌ బెజవాడ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాడంటూ పోస్టు ఏసీఏలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణ

సొంత పార్టీవారికే వేధింపులు..

అలవిగాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం.. వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా రెండేళ్లలోనే జనాగ్రహాన్ని చవిచూస్తోంది. కూటమి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ పిలుపునిచ్చిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో ప్రజానీకం స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. శుక్రవారం విజయవాడ సెంట్రల్‌, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్ల ప్రతులను దహనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్‌మోహనరావు, నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. – సాక్షి నెట్‌వర్క్‌
నయవంచనపై బిగిసిన పిడికిళ్లు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌(నాని) ఓ పార్లమెంట్‌ సభ్యుడిపై మరోసారి ఫైర్‌ అయ్యారు. విజయవాడను భయాందోళనకు గురిచేయడమే కాకుండా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వాటి వివరాలతో తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పెద్ద పోస్టు పెట్టారు.

ఆయన పోస్టులో ఇలా ఉంది..

ప్రస్తుత ఎంపీపై వరుసగా వెలుగులోకి వస్తున్న ఆరోపణలు.. రాజకీయ, వ్యాపార సామాజిక వర్గాల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. భూ ఆక్రమణలు, వివిధ రకాల అక్రమ దందాలు, క్రీడా సంస్థల్లో అవినీతి, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం వంటి అంశాల వెనుక పార్లమెంట్‌ సభ్యుడి ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉందనే ఆరోపణలు పౌర సమాజంలో కలకలం రేపుతున్నాయి. క్రీడా రంగాన్ని కూడా వదలకుండా సదరు ఎంపీ తన అధికార ప్రభావాన్ని వినియోగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

వాణిజ్య సముదాయంపై ఒత్తిళ్ల వివాదం..

నగరంలోని బెంజ్‌ సర్కిల్‌ సమీపంలో ఉన్న ఒక ప్రముఖ వాణిజ్య సముదాయానికి సంబంధించి పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంపీ దిశానిర్దేశంతోనే ఒక ప్రవాస భారతీయ మహిళ ఏర్పాటు చేయదలచిన వ్యాపార సంస్థ (బ్రూవరీ) కోసం, సదరు భవనాన్ని రెండేళ్లపాటు అద్దె లేకుండా అందించాలని భవన యజమానిపై ఉన్నతాధికారుల స్థాయి నుంచి ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. భవనాన్ని ఉచితంగా ఇవ్వకపోతే దానిని ‘అనధికార నిర్మాణం’గా పేర్కొంటూ కూల్చివేస్తామని మున్సిపల్‌ అధికారుల ద్వారా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం ఉంది. ఒక కుటుంబానికి సంబంధించిన ఆస్తి వివాదంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతూ, లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా విమర్శలు వస్తున్నాయి.

మైలవరం నియోజకవర్గంలో అక్రమాలను ప్రశ్నించిన సొంత పార్టీ వారిపైనే పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. అరెస్ట్‌ చేసిన అనంతరం వారిని నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లడమే కాకుండా, కక్ష సాధింపులో భాగంగా ఏకంగా సెక్షన్‌ 307 (హత్యాయత్నం) కింద అక్రమ కేసులు బనాయించారు. ఎంపీ నీడలో రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌, ఇసుక, మట్టి మాఫియా, ఫ్లైయాష్‌ దందా, పేకాట క్లబ్స్‌, ప్రైవేటు సెటిల్‌మెంట్స్‌ యథేచ్ఛగా సాగుతున్నాయి. వారికి టాస్క్‌ఫోర్స్‌ అండగా నిలుస్తోంది. విజయవాడలో ఓ విద్యాసంస్థ భూమి ఆక్రమించే యత్నాలు సాగుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement