పటమట(విజయవవాడతూర్పు): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన భారీ సైకిల్ ర్యాలీలో బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత పాల్గొన్నారు. అశోక్‌నగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు పర్యావరణ అవగాహన ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, భావితరాల భవిష్యత్తు కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందన్నారు. చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులను, హస్తకళల ఉత్పత్తులను వినియోగించి కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత, పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మొక్క నాటిన హోమంత్రి..
ఆటోనగర్(విజయవాడతూర్పు): స్థానిక అగ్నిమాపక కేంద్రం ఆవరణలో హోం మంత్రి వి. అనిత మొక్క నాటారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా స్థానిక నోవోటెల్ హోటల్ నుంచి ఆటోనగర్ ఫైర్ స్టేషన్ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫైర్ స్టేషన్‌ను పరిశీలించారు. అత్యవసర సేవల వివరాలను ఇక్కడి అధికారి జీవీ రామారావుతో పాటు పలువురిని ఆమె అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పి. వెంకటరమణ, అడిషినల్ డైరెక్టర్ జి. శ్రీనివాసులు, జిల్లా అధికారి ఏవీ శంకర్రావు పాల్గొన్నారు.
సైకిల్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సవిత


