ప్రకృతి పరిరక్షణ దిశగా అడుగులు వేయాలి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ప్రపంచ పర్యావరణ దినోత్సవం కేవలం ఒక రోజు కార్యక్రమానికే పరిమితం కాకూడదని, ప్రతి రోజూ పర్యావరణ దినోత్సవంలా భావిస్తూ ప్రకృతిని పరిరక్షించే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య చెప్పారు. స్థానిక రమేష్ ఆసుపత్రి రోడ్డులోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా) కళాశాల ఆవరణలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మొక్కలు నాటారు. అనంతరం కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో జరిగిన సభలో మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం లేకుండా స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించడం సాధ్యం కాదన్నారు. రోడ్లపై పడేసే ప్లాస్టిక్ కవర్లు, నీటి సీసాలు, ఇతర వ్యర్థాలు చెత్త కుప్పలుగా మారి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని, వాటి ప్రభావం నేల, నీరు, గాలి వాటి పైన మాత్రమే కాకుండా మన ఆరోగ్యంపైనా తీవ్రంగా ప్రభావం చూపుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య బోర్డు చైర్మన్ ఎన్.విజయకుమార్ మాట్లాడుతూ వాతావరణ కాలుష్యం వల్ల పిచ్చుకలతో పాటు కాకులు కూడా అంతరించిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. చెట్లను నరికి, అడవుల్ని ఆక్రమించుకోవడం వల్ల ఇలాంటి మరెన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాం, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బి.అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పొలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను, ప్రకృతితో మానవ సంబంధాన్ని తెలియజేసేలా నిర్మించిన ఎగ్వా చిత్రాన్ని ప్రదర్శించారు. ఏపీపీసీబీ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ రాజశేఖర్‌తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రైల్వే డివిజన్‌లో ముగిసిన
పర్యావరణ దిన వేడుకలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్‌లో పర్యావరణ దిన వేడుకలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఎన్విరాన్‌మెంట్ అండ్ హౌస్‌కీపింగ్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రైల్వే ఆడిటోరియంలో జరిగిన ముగింపు వేడుకల్లో డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 15 నుంచి జూన్ 5 వరకు డివిజన్‌లో నిర్వహించిన వేడుకల్లో భాగంగా ఉద్యోగులు, విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ వలంటీర్లు, ప్రయాణికులతో అనేక పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా పర్యావరణ అనుకూల పద్ధతులు, వాతావరణంలో మార్పులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు రూపొందించిన కార్యాచరణలను ప్రస్తావించారు. డివిజన్ వ్యాప్తంగా 43 ప్రాంతాలలో పర్యావరణ ప్రతిజ్ఞలు, 1,060 మొక్కలు నాటడం, 158 అవగాహన ప్రదర్శనలు, 25 ఆరోగ్య అవగాహన, 27 సంతకాల సేకరణ కార్యక్రమాలను నిర్వహించినట్లు వివరించారు. అనంతరం పర్యావరణ అనుకూల పద్ధతులను పాటించడంలో కృషి చేసిన 15 మంది సిబ్బందికి డీఆర్‌ఎం చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు కొండా శ్రీనివాసరావు, పీఈ ఎడ్విన్, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య