ఇద్దరు చైన్‌ స్నాచర్‌ల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు చైన్‌ స్నాచర్‌ల అరెస్ట్‌

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

నేరస్తుల నుంచి రూ.8.50 లక్షల విలువ చేసే నగలు రికవరీ విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు

కోనేరుసెంటర్‌: మచిలీపట్నంలోని పలు ప్రాంతా ల్లో అనేక నేరాలకు పాల్పడిన ఇద్దరు చైన్‌ స్నాచర్‌లను బందరు సీసీఎస్‌, మచిలీపట్నం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం బందరు ఇన్‌చార్జ్‌ డీఎస్పీ కె.శ్రీనివాసరావు మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం కై కలూరు మసీదు సెంటర్‌ ఎన్‌జీవోస్‌ కాలనీకి చెందిన మహమ్మద్‌ ఖాజా మొయినుద్దీన్‌, మహమ్మద్‌ హిమామ్‌ షరీఫ్‌ గతంలో మచిలీపట్నంలోని చిలకలపూడి, కొబ్బరితోట, కలెక్టర్‌ బంగ్లా ప్రాంతాల్లో అనేక నేరాలకు పాల్పడి ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలను తెంచుకుపోయారు. శుక్రవారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆదేశాల మేరకు బందరు సీసీఎస్‌ సిబ్బంది, మచిలీపట్నం స్టేషన్‌ సిబ్బంది చిలకలపూడి సెంటర్‌లోని శ్రీపాండురంగా హైస్కూలు సమీపంలో జాయింట్‌ వెహికల్‌ చెకింగ్‌ చేస్తుండగా ఖాజా మొయినుద్దీన్‌, హిమామ్‌ షరీఫ్‌ ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా కనిపించారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి వారిద్దరూ కంగారుపడుతుండటంతో అనుమానం వచ్చిన సీసీఎస్‌ ఎస్‌ఐ నాగరాజు, మచిలీపట్నం స్టేషన్‌ ఎస్‌ఐ జగదీష్‌ వారిని అడ్డగించి వారి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా ఈ గత నెల 11వ తేదీ రాత్రి కలెక్టర్‌ బంగ్లా వెనుక ఉన్న ఎన్‌జీవో కాలనీ సమీపంలో ఒంటరిగా వెళుతున్న మహిళ మెడలో రెండు బంగారు గొలుసులు తెంచుకుపోయినట్లు చెప్పారు. గతంలో చేసిన నేరాల గురించి కూడా పోలీసులకు చెప్పారు. వారిచ్చిన సమాచారం మేరకు గతంలో వారు చేసిన చోరీలకు సంబంధించి వారి నుంచి రూ.8.50 లక్షల విలువ గల 60 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నేరాలకు ఉపయోగించిన పల్సర్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించటంలో ప్రతిభ కనబరచిన ఎస్‌ఐలు నాగరాజు, జగదీష్‌లతో పాటు సీసీఎస్‌ సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో సీసీఎస్‌ ఎస్‌ఐ నాగరాజు, మచిలీపట్నం ఎస్‌ఐ జగదీష్‌, ఆయా స్టేషన్‌ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement