యువకుడి హత్య కేసులో నిందితులు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

యువకుడి హత్య కేసులో నిందితులు అరెస్ట్‌

Jun 6 2026 1:53 AM | Updated on Jun 6 2026 1:53 AM

గన్నవరం: మండలంలోని దావాజీగూడెంలో ఇటీవల జరిగిన యువకుడి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలను సీఐ బీవీ శివప్రసాద్‌ మీడియాకు వివరించారు. హత్యకు గురైన కంకిపాడు మండలం వేల్పూరుకు చెందిన పామర్తి హేమకుమార్‌కు గన్నవరం మండలం అల్లాపురానికి చెందిన వెలవెల జయంత్‌ కుటుంబాల మధ్య గత రెండేళ్లుగా వివాదాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 30వ తేదీన మద్యం తాగిన హేమకుమార్‌, జయంత్‌ పరస్పరం ఘర్షణకు దిగారు. వీరిద్దరికీ పరిచయస్తుడైన డొక్కా దిలీప్‌ ఈ ఘర్షణను అడ్డుకున్నాడు. ఈ తరుణంలో జయంత్‌ తన బైక్‌ తాళంతో హేమకుమార్‌ మెడపై పొడవగా చిన్న గాయమైంది. దీనికి ప్రతీకారంగా జయంత్‌ కోసం గాలిస్తున్న హేమకుమార్‌, అతని స్నేహితులు లోకేష్‌, ఖాదర్‌ స్థానిక బజాబ్‌ షోరూమ్‌ వెనుక ఉన్న మైదానంలో క్రికెట్‌ ఆడుతున్న డొక్కా దిలీప్‌పై దాడి చేసి కొట్టారు. అదే రోజు రాత్రి పాటిటెక్నిక్‌ కాలేజీ సమీపంలో సిగరెట్‌ తాగుతున్న హేమకుమార్‌పై జయంత్‌ దాడి చేసి కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన హేమకుమార్‌ను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మృతి చెందినట్లు సీఐ శివప్రసాద్‌ వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడైన జయంత్‌తో పాటు హత్యకు సహకరించిన అతని స్నేహితులు గుణదీప్‌, భావధీర్‌లను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు, హత్య చేసిన తర్వాత పరారయ్యేందుకు వినియోగించిన మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. ఈ ముగ్గురు నిందితులను నూజివీడు కోర్టుకు హాజరుపర్చగా, ఈ నెల 18వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్‌ విధించటంతో నెల్లూరు సెంట్రల్‌ జైల్‌కు తరలిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా సీఐ చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement