కృష్ణలంక(విజయవాడతూర్పు): మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఆరుగురు వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో ట్రాఫిక్ పోలీసులు గత నెల రోజుల వ్యవధిలో వాహనాల తనిఖీల్లో మద్యం తాగి పట్టుబడిన 84మంది వాహన చోదకులను గురువారం ఒకటో స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి కాసాని సీతామహాలక్ష్మి వారిని విచారించి ఒక వ్యక్తికి మూడు రోజులు జైలు శిక్ష విధించగా మరో ఐదుగురికి ఒక్కొక్కరికి రెండు రోజుల చొప్పున జైలుశిక్ష విధించారు. మిగిలిన 78 మందికి రూ.7లక్షల 80వేలు జరిమానాగా విధించారు. ప్రతిరోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తామని డీసీపీ షిరీన్ బేగం హెచ్చరించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి జైలుశిక్ష
Jun 5 2026 10:15 AM | Updated on Jun 5 2026 10:15 AM
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి జైలుశిక్ష
రెండు కేజీల గంజాయి స్వాధీనం వీరులపాడు: అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ అభిమన్యు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన సమాచారం మేరకు గంజాయి అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారంతో మండలంలోని పొన్నవరం క్రాస్ రోడ్డు వద్ద గురువారం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంలో గంజాయి తీసుకువస్తున్న యువకుడిని గుర్తించి వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు రెండు కేజీల గంజాయి లభ్యమైందని తెలిపారు. పట్టుబడిన వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఆలూరు గ్రామానికి చెందిన యర్రంశెట్టి చరణ్ విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యువకుడిపై గతంలో కూడా గంజాయి తరలించాడనే ఆరోపణలున్నాయని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు, పొక్లెయిన్ సీజ్ కంచికచర్ల: ప్రభుత్వ అనుమతులు లేకుండా కృష్ణానది, మునేరు, కట్టలేరు, వైరా ఉపనదుల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరపరాదని, ఒకవేళ తవ్వకాలు జరిపితే కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని నందిగామ రూరల్ సీఐ వైవీఎల్ నాయుడు హెచ్చరించారు. కీసర మునేటిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్‌తో పాటు రెండు లారీలను గురువారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఉచిత ఇసుక పథకం మాటున కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో తనిఖీలు చేసి పట్టుకున్నామన్నారు. పట్టుకున్న లారీలు, పొక్లెయిన్‌ను రెవెన్యూ కార్యాలయానికి తరలించి వారికి అప్పగించామని చెప్పారు. తనిఖీల్లో ఎస్‌ఐ పి.విశ్వనాథ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement


