ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.41 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 16 రోజులకు రూ.3,41,39,565 నగదు. 273 గ్రాముల బంగారం, 4.450 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. ఇక విదేశాలకు చెందిన కరెన్సీ సైతం భారీగానే లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. 349 యూఎస్‌ఏ డాలర్లు, 335 నేపాల్ రూపీ, 1,390 యూఏఈ దిర్హమ్స్, 195 కెనడా డాలర్లు, 200 సౌత్ ఆఫ్రికా రాండ్‌లు, 100 రష్యన్ రుబీలు, 200 ఓమన్ బైంసాలు, ఐద వేల సిరియా పౌండ్లు లభించాయని వివ రించారు. కానుకల లెక్కింపును దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొనగా, పోలీసులతో పాటు ఎస్‌పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించారు.
ప్రభుత్వాస్పత్రి స్టోర్స్‌లో డీఎంఈ తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలోని డ్రగ్ స్టోర్స్‌ను బుధవారం రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ విష్ణువర్ధన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం స్టోర్స్‌లో స్టాక్ ఎంత ఉంది, విని యోగం ఎంత, అత్యవసర మందులు, రెండే ళ్లలో వాడిన మందుల రికార్డులు వంటి వాటిని తనిఖీ చేశారు. స్థానికంగా కొనుగోలు చేసిన మందుల వివరాలు రికార్డులను పరిశీలించారు. సుమారు గంట పాటు ఆయన స్టోర్స్‌లో తనిఖీ చేశారు. ఆయన వెంట అడిషనల్ డీఎంఈ డాక్టర్ వి.రాధికారెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్, ఇతర అధికారులు ఉన్నారు. గతంలో కొనుగోలు చేసిన మందులు, సర్జికల్స్‌పై ఫిర్యాదుల రావడంతోనే తనిఖీలు నిర్వహించినట్లు ఆస్పత్రిలో చర్చ జరిగింది. అసలు కారణం ఏమిటనేది తెలియరాలేదు. ప్రస్తుతం ఉన్న మందులు, అత్యవసర మందుల స్టాక్ రిజిస్టర్‌ను కూడా పరిశీలించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): వంకర పాదాలు (క్లబ్ ఫుట్)తో పుట్టిన చిన్నారులను తొలిదశలో గుర్తించి, సరైన సమయంలో చికిత్స పొందితే నయం చేయవచ్చని జిల్లా ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాధవీనాయుడు అన్నారు. ప్రపంచ క్లబ్‌ఫుట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలోని డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవీనాయుడు మాట్లాడుతూ వంకర పాదాలతో పుట్టిన పిల్లలను గుర్తిస్తే ఆర్‌బీఎస్‌కే ద్వారా చిన్నారులకు ఉచితంగా స్క్రీనింగ్, నిర్ధారణ, చికిత్సలు అందిస్తున్నట్లు వివరించారు. పీడియాట్రిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సునీత మాట్లాడుతూ క్లబ్ ఫుట్ అనేది పుట్టుకతో వచ్చే సమస్య అయినప్పటికీ, సరైన చికిత్స అందితే సాధారణ పిల్లల మాదిరిగా నడవగలగుతారన్నారు. డీఈఐసీ సెంటర్ పీడియాట్రిక్ నిపుణులు డాక్టర్ కె.అమిత, ఫిజియోథెరపిస్టు కె.ప్రసన్న, చైల్డ్ సైకాలజిస్ట్ టి. దుర్గాప్రసాద్, ఎస్.ప్రవీణ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
మూలపాడు(ఇబ్రహీంపట్నం): మూలపాడు సీతాకోకచిలుకల పార్క్ (నగర వనం)ను రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు కంచికచర్ల ఫారెస్ట్ డీఆర్వో శివప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. నగరవనంతో పాటు పరిసర అటవీ ప్రాంతంలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురు, శుక్రవారాలు సీతాకోక చిలుకల పార్క్ మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. సందర్శకులను వనంలోకి అనుమతించడం లేదని తెలిపారు. పనులు పూర్తి అయిన తరువాత ప్రవేశాలకు అనుమతి ఇచ్చే తేదీలను ప్రకటించనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


