కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) లోక్‌సభ వేధికగా జరిగిన ఓటింగ్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, అలాగే కొత్త జనాభా గణన నిర్వహించకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలు కల్పించే డీలిమిటేషన్ బిల్లును లోక్‌సభ తిరస్కరించింది.
సుదీర్ఘ చర్చల అనంతరం ప్రవేశపెట్టిన రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు వీగిపోవడంతో మిగతా రెండు బిల్లులకు ఓటింగ్ అవసరం లేకుండా పోయింది. ఈ ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి.
బిల్లు ఆమోదానికి కావాల్సిన ఓట్ల సంఖ్య 352. దాంతో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దాంతో మిగతా రెండు బిల్లులు డీలిమిటేషన్, మహిళ రిజర్వేషన్ బిల్లులను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.
బిల్లులివే..
రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026: మహిళా రిజర్వే షన్లను 2029 నుంచే అమలు చేయడానికి వీలుగా గతంలోని జనగణనను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం.
కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026: అసెంబ్లీల్లో 33శాతం మహిళల కోటా అమలుకు వీలుగా కేంద్ర పాలిత ప్రాంతాలో నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టడం.
డీలిమిటేషన్ బిల్లు-2026: దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి వీలుగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం.
బిల్లులు ప్రవేశఫెట్టేముందు కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ‘ఓబీసీలను వ్యతిరేకించే పార్టీల్లో కాంగ్రెస్ ముందుంటుంది. చరణ్ సింగ్,కేసరిలాంటి ఓబీసీలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. ఓబీసీల కోసం కాకాసింగ్ కాలేకర్ చేసిన సూచనలను కాంగ్రెస్ తుంగలో తొక్కింది. మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను సైతం కాంగ్రెస్ ఆమోదించలేదు. వీపీ సింగ్ వచ్చిన తర్వాత మండల్ కమిషన్ రిపోర్టుకు మోక్షం దక్కింది. రాజీవ్ గాంధీ తన జీవితాంతం మండల్ కమిషన్ నివేదికను వ్యతిరేకిస్తూ వచ్చారు.
15-20 సార్లు ఎన్నికల్లో ఓడిపోయాక కాంగ్రెస్‌కు ఓబీసీలు గుర్తుకొచ్చారు. బీజేపీ మాత్రమే అత్యంత వెనకబడిన ఓబీసీ నాయకుడు మోదీని ప్రధానినిన చేసింది. మోదీ ప్రభుత్వంలో 27మంది కేంద్రమంత్రులు ఓబీసీలే. మొత్తం క్యాబినెట్‌లో ఓబీసీల శాతం 40. 1992,72,73 సవరణల ద్వారా వీపీ నరసింహరావు పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. పీవీ నరసింహరావును ఎప్పుడూ కాంగ్రెస్ తన సొంత మనిషిగా భావించలేదు. 1996లో దేవేగౌడ 81వ సవరణ ద్వారా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. మహిళా బిల్లును బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. మన్మోహన్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన పార్టీలే మహిళా బిల్లును వ్యతిరేకించాయి.
కాంగ్రెస్ కుట్రతోనే తన అనుకూల పార్టీలతో మహిళా బిల్లును వ్యతిరేకించింది.ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లును.. అడ్డుకుంటున్న వారికి ప్రజాక్షేత్రంలో మహిళలు బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు.


